ప్రకాశం జిల్లా పర్చూరు మండలం రమణాయపాలెంలో... నాలుగు రోజుల క్రితం జరిగిన కిడ్నాప్ కలకలం సృష్టించింది. ఎట్టకేలకు కిడ్నాప్‌కు డ్రామాను పోలీసులు ఛేదించారు.
గుంటూరు జిల్లా బాపట్ల మండలం నర్సాయపాలెంకు చెందిన నాగరాజు, కంకటపాలెంకు చెందిన ధర్మయ్య ఇద్దరూ చిన్ననాటి స్నేహితులు. వ్యాపారంలో భాగంగా ధర్మయ్య పేరున మూడు, నాగరాజు పేరున రెండు ప్రోక్లెనర్లు రిజిస్ట్రర్ చేశారు. ధర్మయ్య ప్రొక్లైనర్కి సంబంధించి లోన్ తీసుకోగా... నెలవారీ కిస్తీలు కట్టాల్సి ఉంది. కిస్తీలు కట్టకపోవటం వలన కంపెనీ వాళ్లు తాఖీదులు పంపించారు. అప్పటి నుంచి వారి మధ్య విభేదాలు మొదలయ్యాయి. ఇదిలా ఉండగా...నాగరాజు 4.5 ఎకరాల పొలాన్ని కొనుగోలు చేశాడు. కొన్న పొలంలో కొంత భాగం తన మిత్రుడు ధర్మయ్య పేరిట రిజిస్ట్రర్ చేసి...ఎప్పుడు అడిగితే అప్పుడు తన పేరున రిజిస్ట్రర్ చెయ్యాలనే ఒప్పందం కుదుర్చుకున్నాడు. వీరిద్దరి మధ్య కొద్ది రోజులుగా పొలం, ప్రోక్లెనర్లు విషయంలో తగాదాలు జరుగుతున్నాయి.
ప్రకాశం జిల్లా పరుచూరు మండలం రమణాయపాలెం వద్ద... ఈనెల 16 వ తేదీన సాయంత్రం ప్రోక్లెనర్లతో పనిచేస్తున్న ధర్మయ్య వద్దకు నాగరాజు వచ్చాడు. మాట్లాడాల్సిన పని ఉందని, కారులో బలవంతంగా ఎక్కించుకుని గుంటూరు జిల్లా కాకుమాను మండలం కట్రపాడు చెరువు వద్దకు నాగరాజును తీసుకువెళ్లాడు. బలవంతంగా స్టాంపు పేపర్లు, ప్రామిసరీ నోట్లు, తెల్ల కాగితాల మీద సంతకాలు, వేలిముద్రలు చేయించుకుని, అర్ధరాత్రి కంకట పాలెం గ్రామ శివార్లలో వదిలి వెళ్లిపోయారు. కిడ్నాప్‌కు గురైన ధర్మయ్య పొలీసులను ఆశ్రయించారు. ధర్మయ్య కిడ్నాప్ విషయంలో... నాగరాజుకు సహకరించిన ఐదుగురిని పోలీసులు అరెస్టుచేశారు. ఖాళీ స్టాంప్ పేపర్లు, ప్రామిసరీ నోట్లు, కారును స్వాధీనం చేసుకున్నారు. మరొక నిందితుడు చంటి పరారీలో ఉన్నాడని, నిందితులను కోర్టుకు హాజరుపరచనున్నట్లు ఇంకొల్లు సీఐ రాంబాబు తెలిపారు.
ఇదీ చదవండి;గిద్దలూరులో...డాన్ టు డస్క్ కార్యక్రమాలు