దేవాలయాలే లక్ష్యంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతున్న ఓ యువకుడు ప్రకాశం జిల్లా కొమరోలు పోలీసులకు చిక్కాడు. నిందితుడ్ని విచారించి 86 గ్రాముల బంగారు ఆభరణాలు, వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.
నేరస్థుల కదలికలపై..
కడప జిల్లా పోరుమామిళ్లకు చెందిన మస్తాన్ వలీ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో దోపిడీలకు పాల్పడుతునట్లు డీఎస్పీ నాగేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. ఇటీవలే ప్రకాశం జిల్లాలో వరుస దొంగతనాలు జరుగుతున్న నేపథ్యంలో మార్కాపురం సబ్ డివిజన్లో నేరస్థుల కదలికలపై డీఎస్పీ నాగేశ్వరరెడ్డి ప్రత్యేక నిఘా బృందాన్ని ఏర్పాటు చేశారు.
అక్కడ తారసపడటంతో..
గస్తీల్లో భాగంగా కడప జిల్లా కాశీనాయన మండలం వద్దమాను గ్రామానికి చెందిన మస్తాన్ వలీ కోమరోలులో బృందానికి తారసపడగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం మస్తాన్ వలీని విచారించగా పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయని డీఎస్పీ నాగేశ్వరరెడ్డి పేర్కొన్నారు.
రాత్రిళ్లు తండ్రితో కలిసి..
తన తండ్రి నాగూర్ వలీతో కలిసి రాత్రి సమయాల్లో ఇళ్లు, దేవాలయాల్లో దోపిడీలకు పాల్పడతాడని డీఎస్పీ నాగేశ్వర రెడ్డి స్పష్టం చేశారు. నిందితులపై ఇప్పటికే రాష్ట్రంలోని పలు ఠాణాల్లో కేసులు కూడా ఉన్నట్లు డీఎస్పీ వివరించారు. కేసు నమోదు చేసుకుని మరింత దర్యాప్తు చేస్తామని ఆయన స్పష్టం చేశారు.