హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన హేమంత్ హత్యకేసులో అవంతి మేనమామ యుగంధర్‌రెడ్డి కీలక వ్యక్తని, తన అక్క అర్చన కళ్లల్లో ఆనందం చూడాలన్న లక్ష్యంతో నెలరోజుల క్రితమే ప్రణాళిక రచించాడని పోలీసులు గుర్తించారు. అవంతి తల్లిదండ్రులు లక్ష్మారెడ్డి, అర్చనలు తరచూ బాధపడటం భరించలేక యుగంధర్‌రెడ్డి వారితో మాట్లాడి హేమంత్‌ను చంపేద్దాం అంటూ ప్రతిపాదించాడని.. వారిద్దరూ అంగీకరించటం వల్ల అప్పటినుంచి ప్రయత్నాలు మొదలుపెట్టాడని భావిస్తున్నారు.
ఒకరిద్దరితో కాకుండా కుటుంబ సభ్యులంతా కలిసి వెళితే అవంతి, హేమంత్‌లకు అనుమానం రాదంటూ యుగంధర్‌రెడ్డే అందరినీ కార్లలో గచ్చిబౌలికి తీసుకువచ్చాడని.. అవంతి, హేమంత్‌లను కార్లో ఎక్కాక బంధువులు, కుటుంబ సభ్యులను వెళ్లిపోవాలంటూ చెప్పి.. హేమంత్‌ను కిరాయి హంతకులతో కలిసి దారుణంగా చంపేశాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇందుకు సంబంధించిన మరిన్ని ఆధారాలను గచ్చిబౌలి పోలీసులు శనివారం సేకరించారు. మరోపక్క హేమంత్ హత్య కేసులో నిందితులైన ఎరుకల కృష్ణ, మహ్మద్‌పాషాలు శనివారం మధ్యాహ్నం స్వయంగా స్టేషన్‌కొచ్చి లొంగిపోయారు. పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితులు జగన్, సయ్యద్‌ల కోసం ప్రత్యేక బృందం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
కొద్ది రోజులైతే లండన్ వచ్చేవారే..
తన అన్న హేమంత్‌ను చంపిన హంతకులందరినీ ఉరితీయాలని సుమంత్ డిమాండ్ చేశారు. హేమంత్ మరణ వార్తతో లండన్ నుంచి ఆయన వచ్చారు. చందానగర్‌లో హేమంత్ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. ‘నా అన్న పెళ్లయ్యాక కొందరు వ్యక్తులు అర్ధరాత్రులు ఫోన్ చేసి రోజుకొకరిని చంపుతామని బెదిరించారు. లండన్‌లో ఉన్న నాకూ ఫోన్ కాల్స్ వచ్చాయి. బాధలో ఉన్నారు కదా అనుకున్నా.. ఇంత దారుణానికి పాల్పడతారనుకోలేదు. నెల రోజుల క్రితమే హేమంత్ నాకు ఫోన్ చేశాడు. కరోనాతో ఇంటీరియర్ డిజైనింగ్ పనులు మందకొడిగా ఉన్నాయి.. నేను.. నా భార్య లండన్ వస్తామని చెప్పాడు. నేను అంగీకరించాను. ముందుగా ఒప్పుకొన్న ఇంటీరియర్ డిజైనింగ్ పనులను డిసెంబరు రెండో వారంలోపు పూర్తి చేయాలని హేమంత్ ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు. లండన్‌లో మంచి ఇల్లు చూడాలని, తరువాత అమ్మానాన్నలను కూడా తీసుకెళ్దామని హేమంత్ చెప్పాడు’ అని సుమంత్ ఆవేదనతో మాట్లాడారు.
చంపింది మేనమామ: అవంతి
‘హేమంత్‌ను చంపాలంటూ మా నాన్న డబ్బు సమకూర్చాడు. మా అమ్మ ప్రోత్సహించింది. వీరిద్దరి మాట కోసం మా మేనమామ యుగంధర్‌రెడ్డి నా భర్తను కిరాతకంగా చంపేశాడు. హేమంత్‌ను పెళ్లి చేసుకోవడం మా తల్లిదండ్రులకు ఇష్టం లేదు. వారికి ఇష్టంలేని పనిచేశానన్న కోపం కంటే పరువు తీశానన్న అహమే ఎక్కువ. పెళ్లి చేసుకున్న రోజు నుంచి ఇప్పటి వరకూ నా తల్లి నాతో మాట్లాడలేదు. ఆస్తి కోసం మనువాడలేదని స్పష్టం చేసేందుకు పోలీసుల సమక్షంలో నా పేరు మీద ఉన్న ఆస్తులన్నింటినీ తిరిగి వారికే ఇచ్చేశా. అంతటితో వారు మా జోలికిరారని అనుకున్నాం.
అరగంట ఆలస్యంగా వచ్చుంటే బతికేవాళ్లం..
"నాతో మాట్లాతామంటూ మా మేనమామ బంధువులు గురువారం మధ్యాహ్నం గచ్చిబౌలిలోని మా ఇంటికొచ్చారు. వారు అరగంట ఆలస్యంగా వచ్చుంటే మేమిద్దరం బతికేవాళ్లం. ఎందుకంటే వచ్చే జనవరిలో నేను, హేమంత్ లండన్‌ను వెళ్లాలనుకున్నాం. నా బీటెక్ ఉత్తీర్ణత ధ్రువపత్రాల కోసం గీతం యూనివర్సిటికీ వెళ్లాలని గురువారం ఉదయమే అనుకున్నాం. బయలుదేరాలనుకునేలోపు వస్తున్నాం అంటూ మా బంధువు రజిత ఫోన్ చేసింది. ఆమె మాటలు నమ్మి యూనివర్సిటీకి వెళ్లకుండా ఇంట్లోనే ఉండిపోయాం. కొద్దిసేపటికే మా ఇంట్లోకి పది మందికిపైగా వ్యక్తులు దూసుకొచ్చారు. మా ఇద్దరినీ ఎత్తుకెళ్లారు. మార్గమధ్యలో నేను కారులోంచి దూకేశాక నన్ను వదిలేయడంతో.. హేమంత్‌ను బాగా బెదిరించి కొట్టి ఎక్కడైనా వదిలేస్తారనుకున్నా... ఇంత దారుణానికి ఒడిగడతారని ఊహించలేదు. మా అమ్మానాన్నలతో సహా అందరినీ ఉరికంబం ఎక్కించాలని పోలీసులను వేడుకుంటున్నా"- హేమంత్ భార్య అవంతి
సినీ ఫక్కీలో అల్లున్ని ఖూనీ... మామతో సహా 14 మంది కటకటాల్లోకి...