అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం పరిధిలోని బోయలపల్లిలో దారుణం జరిగింది. తన ఇద్దరు కుమారులను ఓ తండ్రి హత్య చేయడం స్థానికంగా కలకలం రేపింది. అయితే అతనికి మతిస్థిమితం లేదని అందుకే ఈ దురాఘతానికి పాల్పడ్డాడని బంధువులు చెబుతున్నారు.
రంగప్ప అనే వ్యక్తికి ఏడేళ్ళ సుదీప్, సుధీర్ ఉన్నారు. రాత్రి తల్లి రాధమ్మతో పడుకున్న వారిని రంగప్ప చంపేశాడు. ఒక్కొక్కరిని గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి హత్య చేశాడు. మొదట సుదీప్‌ను తీసుకెళ్లి హతమార్చి గుంతలో పూడ్చి పెట్టాడు. తర్వాత సుధీర్‌ను తీసుకెళ్లి చంపేశాడు. ఆ చిన్నారిని పూడ్చి పెట్టాడు.
బిడ్డలు తన పక్కనే లేకపోయేసరికి తల్లి రాధ... కంగారు పడింది. స్థానికుల సహాయంతో చుట్టుపక్కల ప్రాంతాలన్నీ వెతికింది. రంగప్పపై అనుమానం వచ్చిన గ్రామస్థులు నిలదీశారు. చివరకు పిల్లలను హతమార్చి పూడ్చిపెట్టిన ప్రదేశానికి అందర్నీ అతను తీసుకెళ్లాడు. ఆ దుర్ఘటన చూసిన అంతా హతాశులయ్యారు.
విషయాన్ని గ్రామ పెద్దలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కళ్యాణదుర్గం డీఎస్పీ వెంకటరమణ, సీఐ శివశంకర్ నాయకులు అటవీ ప్రాంతానికి వెళ్లి పూర్తి సమాచారం సేకరించారు. నిందితుడు రంగప్పను అదుపులోకి తీసుకున్నారు. ముచ్చటగొలిపే మాటలతో అప్పటి వరకు అల్లరి చేసి పడుకున్న బిడ్డలు ఇద్దరు ఇలా అచేతనంగా పడి ఉండటాన్ని చూసి కన్నతల్లి రాధ బోరున విలపించింది. ఆమెతోపాటు బంధువుల రోధనలు మిన్నంటాయి.
ఇదీ చదవండి: రాష్ట్రంలో 71,821 హెక్టార్లలో పంట నష్టం: వ్యవసాయశాఖ