దేశవ్యాప్తంగా పోలీసులపై నమోదైన కేసుల్లో అత్యధికం ఏపీలోనే ఉన్నాయంటూ జాతీయ నేర గణాంక సంస్థ (ఎన్‌సీఆర్‌బీ) తాజాగా విడుదల చేసిన నివేదిక వివాదానికి దారితీసింది. గతేడాది దేశం మొత్తం మీద పోలీసులపై 4,068 కేసులు నమోదు కాగా.. అందులో 1,681 ఏపీలోనే రికార్డయ్యాయని ఎన్‌సీఆర్‌బీ తెలిపింది. 2018లో నమోదైన 97 కేసులతో పోలిస్తే ఏపీలో ఈ తరహా కేసులు 1,584 పెరిగినట్లు వెల్లడించింది.
ఇంకా ఏం చెప్పిందంటే..
- దేశవ్యాప్తంగా ఈ తరహా నేరాల్లో 2018లో ఏపీ వాటా 1.77 శాతంగా ఉండగా.. 2019లో అది 41.32 శాతానికి పెరిగింది.
- పోలీసులే నేరాలకు పాల్పడిన ఘటనలపై ఆంధ్రప్రదేశ్‌లో నమోదైన 1,681 కేసులకు సంబంధించిన నిందితుల్లో 85 మందిని అరెస్టు చేశారు. రక్షక భటులపై నిరుడు నమోదైన వాటిల్లో 302 (17.96%) కేసుల్లోనే అభియోగపత్రాలు దాఖలు చేశారు. మరో 55 ఘటనల్లో తుది నివేదికలు సమర్పించారు. 2019లో ఎనిమిది కేసుల్లో న్యాయస్థానాల్లో విచారణ పూర్తవగా ఒక్క దాంట్లోనూ పోలీసులకు శిక్ష పడలేదు.
ఏపీ పోలీసు ఉన్నతాధికారులు ఈ గణాంకాలపై తొలుత స్పందించలేదు. దీనిపై దుమారం చెలరేగటంతో నివేదికను విశ్లేషించారు. రెండో స్థానంలో ఉన్న మహారాష్ట్రకు, ఏపీకి మధ్య 1,278 కేసుల వ్యత్యాసం ఉండటం, ఏపీ కంటే విస్తీర్ణంలోనూ, జనాభాలోనూ పెద్దగా ఉండే రాష్ట్రాలు, నేరాల రేటు అధికంగా ఉండే రాష్ట్రాల్లోనూ ఇలాంటి కేసులసంఖ్య చాలా తక్కువగా ఉన్నట్లు గమనించారు. మన రాష్ట్రంలోని అన్ని జిల్లాలోనూ కేసుల సంఖ్య పదిలోపే ఉండగా.. చిత్తూరు, విశాఖపట్నం గ్రామీణ, విశాఖపట్నం నగరం పరిధిలో వరుసగా 409, 972, 257గా ఉండటాన్ని గుర్తించారు. ఆయా జిల్లాల్లోని వివరాలను మళ్లీ సరిచూడగా.. వరుసగా 4, 2, 1 కేసులు మాత్రమే నమోదయ్యాయని, డేటా ఎంట్రీలో తప్పిదాలతో ఆ సంఖ్య వందల్లోకి వెళ్లిపోయినట్లు తేల్చారు. ఈ తప్పిదాల బాధ్యులకు ఛార్జీ మెమోలు జారీ చేశారు. వాస్తవంగా ఆయా జిల్లాల్లో ఎన్ని కేసులు నమోదయ్యాయనే అంశంపై తాజా వివరాలను ఎన్‌సీఆర్‌బీకి పంపించారు. త్వరలో సవరించిన నివేదిక విడుదలవుతుందని చెబుతున్నారు.
ఇదీ చదవండి: నేటి నుంచి రాజధాని వ్యాజ్యాలపై రోజువారీ విచారణ