పబ్జి గేమ్‌కు బానిసై బీటెక్ విద్యార్థి కిరణ్ కుమార్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్న ఘటన అనంతపురంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నగరంలో రెవెన్యూ కాలనీలో ఉన్న నరసింహారెడ్డి, హిమజా రాణి కుమారుడు కిరణ్ కుమార్ రెడ్డి.
చెన్నైలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న కిరణ్ కుమార్ రెడ్డి కళాశాలలో చదువుకుంటుండగా పబ్జీ గేమ్‌కు అలవాటుపడ్డాడు. ఇటీవల ప్రభుత్వం పబ్జీ గేమ్ నిషేధించింది. అప్పటి నుంచి కుంగుబాటుకు లోనైన కిరణ్... ఐదో తేదీన ఇంటి నుంచి వెళ్లిపోయాడు. కుమారుడు కనిపించకపోయేసరికి ఆ తల్లిదండ్రులు కంగారు పడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వివరాలు నమోదు చేసుకొని... గాలింపు చేపట్టారు.
ఏదో పని మీద... స్టోర్‌రూం తెరిచిన చూస్తే జరిగిన ఘోరం తెలిసింది. పబ్జీ నిషేధించారన్న ఆవేదనతో ఉన్న కిరణ్... ఆత్మహత్య చేసుకున్నాడని గుర్తించారు తల్లిదండ్రులు. కుళ్లిన శవాన్ని చూసి బోరున విలపించారు. సమాచారం అందుకున్న పోలీసులు... సంఘటనా స్థలానికి చేరుకొన్నారు. ఏడో తేదీనే కిరణ్ ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిపారు.
ఇదీ చదవండి: మెప్మా బజార్లపై కరోనా ప్రభావం