హైదరాబాద్ లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో.. భారీగా బంగాాన్ని కస్టమ్స్ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారంతో కస్టమ్స్ అధికారులు.. ఎయిర్ కార్గో నుంచి పార్సిల్‌ను స్వాధీనం చేసుకుని తెరచి చూడగా బంగారు ఆభరణాలు, వజ్రాలు, బంగారు బిస్కెట్లు గుర్తించారు. అందులో రెండు కిలోలు విదేశీ బంగారం కాగా.. వజ్రాలు, ఆభరణాలు, బంగారు బిస్కెట్లు కలిసి మరో 19 కిలోలు ఉన్నట్లు వెల్లడించారు.
అయితే... పార్సిల్‌పై ఫోన్ నంబరు మినహా ఏ వివరాలు లేకపోవడం వల్ల... ఎవరు పంపించారన్న దానిపై ఆరా తీస్తున్నారు. ఫోన్ నంబర్ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన కస్టమ్స్ అధికారులు.. కార్గోలో ఈ పార్సిల్‌ను ఎవరు ముంబయికి పంపించారన్న వివరాలు రాబట్టేందుకు అక్కడ సీసీ కెమెరాల్లో రికార్డైన విజువల్స్ ను పరిశీలిస్తున్నారు.
అనుమానమే నిజమైంది
సాధారణంగా ఎయిర్ కార్గో నుంచి ఏ పార్సిల్ పంపించినా వారి చిరునామా, ఫోన్ నంబర్ తదితర వివరాలు ఉంటాయి. అదే విధంగా ఎక్కడికి వెళ్లాలో అక్కడకు సంబంధించిన వివరాలు ఫోన్ నంబరుతో సహా ఉంటాయి. కానీ ఆ పార్శల్లో అలాంటివేమి లేకపోవడం వల్ల అనుమానం వచ్చి కస్టమ్స్ అధికారులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన స్పెషల్ ఇంటిలిజెన్స్ బ్యూరో ఆప్ కస్టమ్స్ విభాగం అధికారులు స్వాధీనం చేసుకున్న పార్శల్‌పై దర్యాప్తు చేస్తున్నారు.