యావత్ ప్రపంచం ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఫలితాలు వచ్చాయి. అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధిరోహించేదెవరో తేలిపోయింది. రిపబ్లికన్ల అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై డెమొక్రాట్ల అభ్యర్థి జో బైడెన్ ఘన విజయం సాధించారు. అమెరికా చరిత్రలో 77 ఏళ్ల వయస్సులో అధ్యక్షుడిగా గెలిచిన మొట్ట మొదటి వ్యక్తిగా అరుదైన ఘనత సాధించారు. అమెరికాలో ఇప్పటివరకు ఏ అధ్యక్షుడు పొందలేనన్ని ఓట్లు సాధించి మరో రికార్డూ సృష్టించారు. అంతేకాకుండా తన 50 సుదీర్ఘ రాజకీయ జీవితంలో చిరకాల స్వప్నంగా ఉన్న 'శ్వేతసౌధ అధిపతి' కలను అగ్రారాజ్యం మాజీ అధ్యక్షుడు ఎట్టకేలకు సాకారం చేసుకున్నారు.
సర్వేలన్నీ బైడెన్‌కే అనుకూలంగా ఉన్నప్పటికీ పోటీ రసవత్తరంగా సాగింది. పోస్టల్ బ్యాలెట్ ఓటర్లందరూ బైడెన్‌కే పట్టంగట్టారు. ఫలితంగా కీలక రాష్ట్రాల్లోనూ ఆయన స్వల్ప వ్యత్యాసంతో ట్రంప్‌ను అధిగమించారు. అధ్యక్ష పీఠానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్‌ను అందుకున్నారు. అయితే బైడెన్ చారిత్రక విజయానికి దోహదపడ్డ అంశాలను ఓసారి పరిశీలిద్దాం.
ట్రంప్ వైఫల్యాలే బైడెన్ విజయానికి సోపానాలు
- కరోనా కట్టడిలో ట్రంప్ దారుణంగా విఫలమవ్వడం.
- దేశంలో నల్లజాతీయులపై అకృత్యాలు పెరిగిపోవడం.
- జాతి విద్వేషాలు రెచ్చగొట్టేలా ట్రంప్ మాట్లాడటం.
- నిరుద్యోగ రేటు అమెరికాలో గతంలో ఎన్నడూ లేని స్థాయిలో పెరిగిపోవడం.
- రష్యాకు అనుకూలంగా ట్రంప్ వ్యవహరిస్తున్నారని ఆరోపణలు.
- ట్రంప్ కేవలం 750 డాలర్లే ఆదాయ పన్నుగా చెల్లించారనే ఆరోపణలు.
భవిష్యత్‌పై భరోసా
- కరోనాను బైడెన్ విజయవంతంగా కట్టడి చేస్తారని ప్రతి 10 మంది ఓటర్లలో నలుగురు విశ్వసించారు.
- అధ్యక్షునిగా ఎన్నికైతే మొదటి రోజే కరోనా నివారణకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించి, కఠిన చర్యలు చేపడతానన్న బైడెన్ హామీ.
- జాతివివక్షకు తావు లేకుండా పోలీస్ వ్యవస్థలో సమూల మార్పులు చేస్తామనే హామీ.
- నల్ల జాతీయురాలు కమలా హారిస్‌ను ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఎంపిక చేసుకోవడం.
- ఆసియా-అమెరికా, నల్లజాతీయుల మద్దతు కూడగట్టుకోవడంలో సఫలం
- ఒబామా హయాంలో రెండు పర్యాయాలు ఉపాధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం.
- పారిస్ ఒప్పందంలో తిరిగి చేరుతామని ప్రకటించడం.
- ఇరాన్‌తో అణు ఒప్పంద పునరుద్ధరణపై పునరాలోచన చేస్తామనడం.