Attack on Children Viral Video: తెలంగాణలోని హైదరాబాద్ మంగళ్‌హాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో గత నెల 29న జరిగిన అమానుష ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చిన్నారులు పేకాట ఆడుతున్నారనే కారణంతో వారిని నగ్నంగా చేసి విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. వీడియో వైరల్ కావడంతో పోలీసుల దృష్టికి చేరింది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
గత శుక్రవారం ధూల్‌పేట్ పరిధిలోని ఓ కొండపై 16 మంది చిన్నారులు పేకాట ఆడుతున్నారు. ఇది గమనించిన ముగ్గురు యువకులు.. వారిని నగ్నంగా చేశారు. అనంతరం చిన్నారులపై విచక్షణారహితంగా కర్రతో దాడికి పాల్పడ్డారు. ముగ్గురిలో మరో యువకుడు.. ఆ వీడియోను తన ఫోన్లో చిత్రీకరించాడు.
అనంతరం సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో తెలుసుకున్న ఓ చిన్నారి తండ్రి పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితులకు నోటీసులు పంపించారు. కాగా చిన్నారులను భాజపా నాయకులే కొట్టారని సామాజిక మాధ్యమాల్లో వీడియో వైరల్ కావడంతో పోలీసులు విచారణ చేపట్టారు. భాజపా నాయకులకు, నిందితులకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. కేసు విచారణలో ఉందని.. పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని పోలీసులు చెప్పారు.
ఇదీ చదవండి: హృదయం లేని జగన్ రెడ్డి పాలనలో.. ఎన్నో దారుణాలు: చంద్రబాబు