ARREST: ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తూ వైకాపా ఎంపీటీసీ సభ్యుడు పోలీసులకు పట్టుబడ్డాడు. చిత్తూరు జిల్లా పెద్దపంజాణి మండలం రాజుపల్లె క్రాస్ వద్ద కర్ణాటక సరిహద్దుల్లో కోలారు జిల్లా పోలీసులు శుక్రవారం తనిఖీలు చేపట్టారు. బైరెడ్డిపల్లె మండలం గొల్లచిమ్మనపల్లె ఎంపీటీసీ సభ్యుడు అభినవ్, గంగాధర నెల్లూరుకు చెందిన మాధవ్, చిత్తూరు నగరంలోని కట్టమంచి వాసి వెంకటేష్, పలమనేరుకు చెందిన అనిల్‌కుమార్ కారులో 17 ఎర్రచందనం దుంగలు అక్రమంగా తరలిస్తూ పట్టుబడ్డారు. వీటి విలువ రూ.45.50 లక్షలని పోలీసులు తెలిపారు. వీరి నుంచి ఎర్రచందనం, ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకున్నారు.
కోలారు జిల్లా అడిషనల్ సూపరింటెండెంట్ సచిన్ గోర్పోడి ఆధ్వర్యంలో ఆ రాష్ట్ర పోలీసులు నెల రోజులుగా వీరి కోసం కాపు కాచినట్లు సమాచారం. అభినవ్ ఇటీవలి ఎంపీటీసీ ఎన్నికల్లో పెద్దఎత్తున డబ్బు ఖర్చుపెట్టినట్లు గ్రామస్థులు తెలిపారు. ఎర్రచందనం నరికివేత, రవాణాలో సూత్రధారుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఏపీలో అధికార పార్టీ అండదండలతో వీరు శేషాచలం అడవుల నుంచి చౌడేపల్లె మీదుగా కర్ణాటకకు దుంగలు తరలిస్తున్నారని సమాచారం.
ఇదీ చదవండి: 'తుమ్మలపల్లి యురేనియం కర్మాగార అణు వ్యర్థాల ప్రభావంపై నివేదిక ఇవ్వండి'