Three persons died in Basara Godavari: అది తెలంగాణలోనే ప్రముఖ పుణ్య క్షేత్రం. రోజు వేల మంది భక్తులు రాకపోకలు సాగిస్తుంటారు. అదే సాక్షాత్తు చదువుల తల్లి కొలువుదీరిన నిర్మల్ జిల్లా బాసర. అక్కడి గోదావరి నదిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తారు. అలాంటి పవిత్ర గోదావరి నేడు మృత్యు గుండంలా మారి ఆత్మహత్యలకు అడ్డాగా తయారయింది. ఏ చిన్న కష్టం వచ్చినా నిర్మల్ జిల్లాతో పాటు చుట్టు ప్రక్కల జిల్లాల ప్రజలు బాసర గోదావరి నదిలో దూకి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనలు ఎన్నో జరిగాయి. ఒక ఘటన మరువక ముందే మరో ఘటన చోటుచేసుకుంటుంది.
ఆర్థిక ఇబ్బందులు తాళలేక తన ఇద్దరు పిల్లలతో సహా గోదావరిలో దూకి మహిళ ఆత్మహత్య చేసుకుంది. బాసరలోని గోదావరిలో మానస అనే మహిళ(27), తన ఇద్దరు పిల్లల బాలాదిత్య(8), నవ్యశ్రీ(7)తో సహా దూకి మృతి చెందింది. మృతులు నిజామాబాద్ జిల్లా గోల్ హనుమాన్కు చెందిన వారుగా గుర్తించారు. నిజామాబాద్‌లోని ఎల్వియర్ షాపింగ్ మాల్లో పని చేస్తున్నట్లు సమాచారం. నిజామాబాద్ నుంచి బస్సులో వచ్చి గోదావరి వంతెన వద్ద ముగ్గురూ దిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
నది వద్ద గంగా హారతి ఇచ్చే ఘాట్ సమీపంలో పిల్లల స్కూల్ బ్యాగులు, ఖాళీ చేసిన టిఫిన్ బాక్సులను గుర్తించారు. పిల్లలకు అన్నం తినిపించిన తర్వాత వారితో సహా తల్లి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. బాసర పోలీసులు గజ ఈతగాళ్లను రంగంలోకి దింపి మృతదేహాలను బయటకు తీసి విచారణ చేపట్టారు.
ఇవీ చదవండి: