విజయవాడ వ్యాపారవేత్త రాహుల్ హత్య కేసు మిస్టరీ వీడింది. రాహుల్‌ను కారులో ఉన్న ఛార్జర్ వైరుతో హత్య చేశారని విజయవాడ సీపీ శ్రీనివాసులు తెలిపారు. కారు వెనక సీట్లో కూర్చుని రాహుల్‌ను హత్య చేసినట్లు చెప్పారు. ఈ హత్య కేసుకు సంబంధించిన వివరాలను గురువారం సీపీ మీడియాకు వెల్లడించారు.
సీపీ మాట్లాడుతూ.. ‘‘కోరాడ విజయ్‌కుమార్ 1991 నుంచి చిట్‌ఫండ్స్ వ్యాపారం చేస్తున్నారు. చాగర్ల గాయత్రి అనే మహిళ ఇందులో భాగస్వామిగా ఉన్నారు. 2019లో ఎన్నికల బరిలో నిలిచిన కోరాడ విజయ్‌కుమార్ ఓటమి పాలవడంతో పాటు భారీగా నష్టపోయారు. ఈ క్రమంలో అప్పుల వాళ్లు వెంటపడటంతో అసహనానికి లోనయ్యాడు. కోరాడ విజయ్‌కుమార్, రాహుల్‌కు వ్యాపార సంబంధాలున్నాయి. తనకు అప్పుల బాధ ఎక్కువ అయిందని.. వారికున్న ఫ్యాక్టరీని విక్రయించి లేదా తన వాటా ఇవ్వాల్సిందిగా కోరాడ విజయ్‌కుమార్ రాహుల్‌పై ఒత్తిడి తీసుకొచ్చారు. డబ్బు ఇవ్వకుండా, షేర్స్ ట్రాన్స్‌ఫర్ చేయకుండా రాహుల్ మాటదాటేస్తూ రావడంతో కోరాడ విజయ్ కుమార్ కోగంటి సత్యం వద్దకు వెళ్లాడు. ఈ ఫ్యాక్టరీలో కోగంటి సత్యం షేర్స్ కొనుగోలు చేసి తను కూడా భాగస్వామి కావాలనుకున్నాడు.
కోగంటి సత్యం, కోరాడ విజయ్‌కుమార్ ఒకటి రెండు సార్లు ఈ విషయంలో రాహుల్‌ను బెదిరించారు. అప్పటికీ రాహుల్ సెటిల్ చేయలేదు. ఇదే సమయంలో చాగర్ల గాయత్రి కూతురికి దిల్లీలో మెడికల్ పీజీ సీటు ఇప్పిస్తానని రాహుల్ రూ.6 కోట్లు తీసుకున్నారు. సీటు ఇప్పించకపోగా.. డబ్బు సైతం తిరిగి ఇవ్వలేదు. ఆ విషయంలోనూ రాహుల్‌పై వారు అసహనంతో ఉన్నారు. ఈ క్రమంలో ఈ నెల 18న రూ.50 లక్షలు ఇస్తానని గాయత్రికి చెప్పి రాహుల్ సీతారాంపురంలోని చిట్‌ఫండ్స్ ఆఫీస్‌కు తన కారులో వెళ్లాడు. కోరాడ విజయ్‌కుమార్‌కు సంబంధించిన కొంత మంది మనుషులు అక్కడికి చేరుకొని రాహుల్‌ను కొట్టారు. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం రాహుల్‌ను వేరే కారులో తీసుకెళ్లారు. కొన్ని పత్రాల మీద సంతకాలు తీసుకున్న కోగంటి సత్యం, కోరాడ విజయ్ కుమార్ అక్కడి నుంచి రాహుల్‌ను పంపించారు. విజయ్‌కుమార్, మరో ముగ్గురితో కలిసి రాహుల్‌ను తన కారు వద్దకు తీసుకెళ్లారు. రాహుల్‌ను కారులోని ముందు సీట్లో కూర్చోబెట్టి ఛార్జర్ వైర్‌తో వెనక నుంచి మెడకు బిగించి హత్య చేశారు’’ అని సీపీ వివరించారు.
వ్యాపారాల్లో కోరాడ విజయ్‌తో రాహుల్‌కు గొడవలు ఉన్నాయి. చాగర్ల గాయత్రి అనే మహిళతో కలిసి కోరాడ చిట్స్ వ్యాపారం చేసాడు. కోరాడ విజయ్.. ఎన్నికల్లో పోటీ చేసి ఆర్థికంగా నష్టపోయాడు. దీంతో కోగంటి సత్యం ద్వారా తన వాటా కోసం రాహుల్‌పై ఒత్తిడి తెచ్చాడు. గతంలో గాయత్రి అనే మహిళ కుమార్తెకు దిల్లీ ఎయిమ్స్‌లో పీజీ సీటు ఇస్తానని రాహుల్ రూ.6 కోట్లు తీసుకున్నాడు. ఆ సీటు ఇప్పటివరకు ఇప్పించలేదు. ఈ వివాదం పరిష్కరించుకుందామని పిలిచి.. పథకం ప్రకారం చంపారు. హత్యకు ముందుకు కోగంటి సత్యం సమక్షంలో డాక్యుమెంట్లపై రాహుల్‌తో సంతకాలు చేయించుకున్నారు. అనంతరం కోగంటి సత్యం చెప్పటంతో... పథకం ప్రకారం రాహుల్ సొంతకారులోనే ఛార్జర్ వైరుతో అతన్ని హత్య చేశారు. హత్య అనంతరం కోరాడకు రవికాంత్ అనే వ్యక్తి ఆశ్రయం ఇచ్చారు. - శ్రీనివాసులు, విజయవాడ సీపీ
ఈ కేసుకు సంబంధించి కోరాడ విజయ్‌కుమార్ సహా ఆరుగురు నిందితులను అరెస్టు చేసినట్లు సీపీ వెల్లడించారు. కోగంటి సత్యాన్ని ఇప్పటికే అరెస్టు చేసినట్లు చెప్పారు. ఇప్పటి వరకు 13 మంది నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: RAHUL MURDER CASE:కోరాడతో పాటు మరో ముగ్గురికి 14 రోజుల రిమాండ్