ROAD ACCIDENT బాపట్ల జిల్లా జెపంగుళూరు మండలం కొండమంజులూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో చిత్తూరు జిల్లాకు చెందిన ఇద్దరు తెదేపా నాయకులు మృతి చెందారు. చిలకలూరిపేట సమీపంలోని కావూరులో జరుగుతున్న వివాహ విందుకు హాజరయ్యేందుకు వెళ్తున్న కారును ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు తెదేపా నాయకులు ప్రాణాలు కోల్పోగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు చిత్తూరు జిల్లా వాసులుగా పోలీసులు గుర్తించారు. ఘటన స్థలంలోనే చంద్రగిరి మండలం తెలుగు యువత అధ్యక్షుడు కొండాడి భానుప్రకాష్ రెడ్డి (31), చిత్తూరు పార్లమెంట్ తెదేపా కార్యానిర్వహణ కార్యదర్శి గంగుపల్లి భాస్కర్ (41) తీవ్రగాయాలై ఒంగోలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. సోమశేఖర్ రెడ్డి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. రేనంగివరం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
బాపట్ల జిల్లా కొండమంజులూరు వద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తెదేపా నాయకుల మృతి ఘటనపై తెలుగుదేశం నేతలు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. పార్టీ కోసం శ్రమించిన, నిబద్ధత గల నాయకులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబసభ్యులకు లోకేశ్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. చికిత్స పొందుతున్న సోమశేఖర్ రెడ్డి త్వరగా కోలుకోవాలని అచ్చెన్నాయుడు ట్వీట్ చేశారు.
చిత్తూరు పార్లమెంటు కార్యనిర్వాహక కార్యదర్శి గంగపల్లి భాస్కర్ రాయల్, చంద్రగిరి టిడిపి తెలుగు యువత అధ్యక్షుడు భానుప్రకాష్ రెడ్డి మృతిపై నారా లోకేశ్, మాజీ మంత్రి గల్లా అరుణకుమారి, చంద్రగిరి ఇన్చార్జి పులివర్తి నాని తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. చంద్రగిరి టవర్ క్లాక్ వద్ద జరిగిన సంతాపసభలో పులివర్తి నాని సతీమణి సుధారెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఇరు కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ రోజు సాయంత్రం ఒంగోలు నుండి పార్దీవదేహాలు చంద్రగిరికి చేరుకోనున్నాయి. రేపు మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ఇవీ చదవండి: