- ఇరవై ఏళ్ల మహేందర్ 15 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి హతమార్చాడు. తన కోరిక తీర్చేందుకు అంగీకరించలేదనే కోపంతో వికారాబాద్ జిల్లా పూడూరు మండలానికి చెందిన బాలిక తలను చెట్టుకేసికొట్టి, అపస్మారస్థితిలోకి వెళ్లాక అత్యాచారం చేసి చంపేశాడు.
- గత డిసెంబరు నెలలో రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో 17 ఏళ్ల కుర్రాడు. అదే వయసు బాలికను పొదల్లోకి లాక్కెళ్లి అత్యాచారం చేశాడు. లంగర్‌హౌస్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఇంటర్ విద్యార్థి 12 ఏళ్ల బాలుడిపై అత్యాచారం చేసి హతమార్చాడు.
- ఇటీవల నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లో మద్యానికి బానిసైన కొడుకు రాముడు.. తల్లి చంద్రమ్మ తల నరికి పారిపోయాడు. ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన పోలీస్‌స్టేషన్ పరిధిలో తల్లి శంకరమ్మను, కుమారుడు లింగయ్య తలపై కొట్టి హత్య చేశాడు.
Teenage Criminals : మద్యం.. డ్రగ్స్.. అశ్లీల చిత్రాలు.. ఇవన్నీ కౌమార వయసు పిల్లలను నేరాలబాట పట్టిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఈ తరహా నేరస్థులు పెరుగుతుండడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. తెలిసీ తెలియని వయసులో యువతలో పెరిగిపోతున్న విశృంఖలత్వం ఫలితంగా పలు ఘోరాలు జరుగుతున్నాయి. చిన్నవయసులోనే మద్యం, డ్రగ్స్‌కు అలవాటుపడడం, ఆ మత్తులో హత్యలు, అత్యాచారాలకు పాల్పడటం మామూలైపోయిందని పోలీసు అధికారులే అంగీకరిస్తున్నారు.
సర్వేలో తేలిన ‘నగ్న’సత్యం : అంతర్జాల సదుపాయం అందుబాటు, డాటా వేగం పెరిగిన తర్వాత చాలామంది యువత అశ్లీల చిత్రాలకు అతుక్కుపోతున్నారు. ‘దిశ’ ఉదంతం జరిగిన తర్వాత పోలీసు అధికారులు నిర్వహించిన ఓ ఉన్నతస్థాయి సమావేశంలో దీనిపై చర్చ జరిగింది. అప్పట్లోనే రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గ్రామంలో జులాయిగా తిరుగుతున్న యువతకు సంబంధించి సర్వే నిర్వహించాలని అధికారులు ఆదేశించారు. ఈ సర్వేలో అనేక ఆశ్చర్యకరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి.
ప్రతి గ్రామంలో అశ్లీల చిత్రాలు, మద్యం, మత్తుమందులకు అలవాటుపడ్డ యువత పదుల సంఖ్యలో ఉన్నట్లు తేల్చారు. వీరందరిపై నిఘా ఉంచాలన్న ఆదేశాలు అటకెక్కాయని, యువతలో నేర ప్రవృత్తి పెరగడానికి అశ్లీల చిత్రాలు, మద్యం, మత్తుమందులే ప్రధాన కారణమని ఓ పోలీసు ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. ‘‘అలాంటి వాళ్లంతా నేరాలకు పాల్పడకపోయినప్పటికీ అవకాశం దొరికినప్పుడు మాత్రం నేరాలు చేసేందుకు వెనకాడటం లేదు.
ఉదాహరణకు అశ్లీల చిత్రాలకు అలవాటుపడ్డ వారు అవకాశం చిక్కినప్పుడు చాటుమాటుగా బంధువులు, స్నేహితులు దుస్తులు మార్చుకుంటున్నప్పుడో, స్నానం చేస్తున్నప్పుడో సెల్‌ఫోన్లలో చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. వీటిని చూపి బెదిరించడమో, లేదంటే తోటివారితో ఈ దృశ్యాలను పంచుకోవడమో చేస్తున్నారు. ఇది తప్పు అనే ఆలోచన లేనంతగా అశ్లీల సంస్కృతి వారి మానసిక పరిస్థితిపై పెత్తనం చేస్తోందని’ ఆ అధికారి విశ్లేషించారు. చక్కదిద్దేందుకు ప్రయత్నించకపోతే ఈ తరహా నేరప్రవృత్తి క్రమంగా పెరుగుతుందన్నారు.
మత్తుమందులతో..మరింత ముప్పు : ఇప్పుడు విచ్చలవిడిగా అందుబాటులోకి వస్తున్న మత్తుమందులు యువతను పూర్తిగా పెడదోవ పట్టిస్తున్నాయి. గ్రామాల్లోనూ గంజాయి విచ్చలవిడిగా దొరుకుతోంది. మత్తుమందులతో జరిగే రేవ్‌పార్టీలు ఇప్పుడు చిన్న పట్టణాలకూ విస్తరించాయి. సూర్యాపేట జిల్లాకు చెందిన బాలుడు(15) గంజాయి వ్యసనానికి బానిసగా మారడం, రోజుల తరబడి ఇంటికి రాకుండా మత్తులోనే జోగుతుండటంతో తల్లి స్తంభానికి కట్టేసి కళ్లలో కారం కొట్టిన ఉదంతమే పరిస్థితికి అద్దం పడుతోందని పోలీసులు చెబుతున్నారు.
‘పెద్దపల్లి జిల్లాలోని ఓ మండల కేంద్రంలో వందల సంఖ్యలో గంజాయి వ్యసనపరుల్ని స్థానిక పోలీసులు గుర్తించారు. మైనర్లతోపాటు వారి కుటుంబసభ్యులకు అక్కడి ఎస్సై పలు విడతలుగా కౌన్సెలింగ్ నిర్వహించారు. అక్కడే ఓ యువకుడు పాతికేళ్లు నిండకముందే గంజాయి, మద్యం మత్తు బారినపడి ప్రాణాలొదిలాడని’ ఓ ఉన్నతాధికారి చెప్పారు. ఇలాంటి అలవాట్లున్న వారు సమయానికి డబ్బు అందకపోతే నేరాల బాటపడతారని, చిన్న వయసు వారిలో నేర ప్రవృత్తి పెరగడానికి ఇదీ ఓ కారణమని పోలీసులు విశ్లేషిస్తున్నారు.
Teenage Criminals in Telangana : జాతీయ నేరాల నమోదు సంస్థ (ఎన్.సి.ఆర్.బి.) గణాంకాల ప్రకారం 2020లో రాష్ట్రంలో 1,266 మంది మైనర్లు వివిధ నేరాలలో అరెస్టయ్యారు. అంటే సగటున రాష్ట్రంలో నెలకు వందమంది మైనర్లు వివిధ నేరాలలో అరెస్టవుతున్నారన్నమాట.
తల్లిదండ్రులూ... ఇలా పసిగట్టండి : పిల్లల ప్రవర్తనలో మార్పు వస్తున్నప్పుడు తొలుత తెలుసుకోగలిగేది తల్లిదండ్రులే. ఉదాహరణకు అశ్లీల చిత్రాలకు అలవాటైన పిల్లలు ఇంట్లో ఒంటరిగా ఉండాలనుకుంటారు. ఎలక్ట్రానిక్ ఉపకరణాలను చాటుమాటుగా చూస్తుంటారు. వారి ఫోన్‌లకు లాక్ వంటివి వినియోగిస్తారు. అన్‌లాక్ వివరాలు ఇవ్వడానికి నిరాకరించినా, అందరితోపాటు కూర్చొని ఎలక్ట్రానిక్ ఉపకరణాలను వాడేందుకు ఇష్టపడకపోయినా అనుమానించాల్సిందే. ఆదిలోనే గమనిస్తే పిల్లల్ని కట్టడి చేయడం సులభం. మద్యం, మత్తుమందులకు బానిసైన వారిని గుర్తించడం మరింత సులభం. ఆలస్యంగా ఇంటికి రావడం, పొద్దుపోయాక నిద్రపోవడం, పగలంతా అలసటగా ఉండటం, తిండి సరిగ్గా తినకపోవడం, చిన్నచిన్న కారణాలకే విసుక్కోవడం, డబ్బులు ఎక్కువగా ఖర్చు పెడుతుండటం, అబద్ధాలు చెప్పడం వంటివన్నీ వీరి లక్షణాలే.
ఇదీ చదవండి :