TDP LEADER MURDER : అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం బ్రాహ్మణపల్లెలో.. తెలుగుదేశం గ్రామస్థాయి నాయకుడు సురేష్‌నాయుడు దారుణహత్యకు గురయ్యారు. గురువారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి.. కర్రలు, రాళ్లతో దాడి చేసి హత్య చేశారని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. చంపిన తర్వాత మృతదేహాన్ని ఇంట్లోని నీటితొట్టెలో పడేశారు.
తలపై బలమైన గాయాలు, కొడవలితో నరికినట్లు గాట్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సురేష్‌నాయుడికి వివాహమైనా.. విబేధాలతో భార్యకు దూరంగా ఉంటున్నారు. ఇంట్లో ప్రస్తుతం సురేష్‌నాయుడు, ఆయన తల్లి నిర్మలాదేవి మాత్రమే ఉంటున్నారు. తల్లి గురువారం వేరే ఊరికి వెళ్లారు. ఇదే అదునుగా రాత్రి వేళ ఇంట్లోకి చొరబడి హత్య చేశారని సురేష్ తల్లి ఆరోపిస్తున్నారు. ఇదంతా వైకాపా నాయకుడు, ZP ఛైర్మన్ ఆకేపాటి అమర్నాథ్‌రెడ్డి సోదరుడు అనిల్‌కుమార్‌రెడ్డి పనే అయ్యుంటుందని కన్నీరుమున్నీరుగా విలపించారు.
రాజంపేటను ఆనుకుని ఉన్న మన్నూరు వద్ద సురేష్ నాయుడికి ఆరు ఎకరాల పొలం ఉంది. దాన్ని తమకు విక్రయించాలని జెడ్పీ ఛైర్మన్ ఆకేపాటి అమర్నాథ్‌రెడ్డి సోదరుడు అనిల్‌కుమార్‌రెడ్డి.. నెల రోజుల నుంచి ఒత్తిడి తెస్తున్నట్లు ఆయన తల్లి చెబుతున్నారు. అయితే అనిల్‌కుమార్‌రెడ్డికి కాకుండా.. తెలుగుదేశం నాయకుడు సుబ్బనర్సయ్యకు 10 రోజుల క్రితం సురేష్‌నాయుడు పొలం విక్రయించారు. దీనిపై కోపం పెంచుకున్న వైకాపా నాయకులు.. తమ కుమారుడిని అంతమొందించి ఉంటారని తల్లి నిర్మలాదేవి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సురేష్‌నాయుడు మృతిని పోలీసులు అనుమానాస్పద మృతిగా శుక్రవారం ఉదయం నమోదు చేశారు. డాగ్ స్క్వాడ్‌ను రప్పించి తనిఖీలు చేశారు. నీటితొట్టెలో పడి ఉన్న మృతదేహాన్ని శవపరీక్ష కోసం రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారన్న విషయం తెలిసి.. హత్య కోణంలో దర్యాప్తు చేయాలంటూ శుక్రవారం సాయంత్రం సురేష్ తల్లి మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వైసీపీ నాయకులు అనిల్‌కుమార్‌రెడ్డి, నాగేంద్రపై అనుమానాలు ఉన్నట్లు పేర్కొన్నారు. వారిపై కేసు నమోదు చేసేందుకు తర్జనభర్జన పడ్డ పోలీసులు.. అనుమానాస్పద మృతి కేసు నమోదు చేశామని చెప్పారు. దర్యాప్తులో అన్ని విషయాలూ తేలుతాయన్నారు.
రాజంపేట నియోజకవర్గంలో వైసీపీ నాయకులు భారీగా భూములు ఆక్రమించి సొమ్ము చేసుకుంటున్న ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. సురేష్‌నాయుడు హత్యకు కారకులైన అసలు నిందితులను పోలీసులు అరెస్ట్ చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.
ఇవీ చదవండి: