తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో నాగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య వ్యవహారంలో మరో సంచలనం బయటకొచ్చింది. ఆత్మహత్యకు ముందు రామకృష్ణ సెల్ఫీ వీడియో తీసుకున్నారు. ఆత్మహత్య నిర్ణయానికి దారి తీసిన పరిస్థితులను అందులో వివరించారు. ఆ వీడియోలో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవేంద్రరావుపై రామకృష్ణ తీవ్ర ఆరోపణలు చేశారు.
‘‘రాఘవ కారణంగా ఎన్నో కుటుంబాలు నాశనమయ్యాయి. అలాంటి దుర్మార్గులను రాజకీయంగా ఎదగనివ్వొద్దు. డబ్బు రూపంలో అడిగినా ఇచ్చేవాడిని. ఏ భర్త కూడా వినకూడని మాటను రాఘవ అడిగారు. నా భార్యను హైదరాబాద్ తీసుకురావాలని కోరారు. రాజకీయ, ఆర్థిక బలంతో పబ్బం గడుపుకోవాలని చూశారు. నేను ఒక్కడినే వెళ్లిపోతే నా భార్య, పిల్లలను వదిలిపెట్టరు. అందుకే నాతో పాటు వారినీ తీసుకెళ్తున్నా. అప్పుల్లో ఉన్న నాపై నా తల్లి, సోదరి కక్ష సాధించారు’’ అని నాగ రామకృష్ణ సెల్ఫీ వీడియోలో చెప్పారు.
సోమవారం వేకువజామున నాగ రామకృష్ణ తన భార్య శ్రీలక్ష్మి, ఇద్దరు పిల్లలు సాహితి, సాహిత్యపై పెట్రోల్ పోసి తానూ నిప్పటించుకున్నాడు. ఈ ఘటనలో అక్కడికక్కడే ముగ్గురు సజీవ దహనం కాగా.. మరో కుమార్తె సాహితి తీవ్రంగా గాయపడింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఆ చిన్నారి కూడా మృతిచెందింది. ఈ ఘటనలో ఇప్పటికే వనమా రాఘవపై పోలీసులు కేసు నమోదుచేశారు.
ఇదీ చదవండి: Palvancha Family Suicide: కుటుంబం ఆత్మహత్య ఉదంతంలో మరో విషాదం.. చికిత్స పొందుతూ చిన్నారి మృతి