Dead Body: ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఓ యువకుడు వడదెబ్బతో ఆసుపత్రిలో చేరి మృతి చెందాడు. ఆ మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకెళ్లడానికి డబ్బులు లేక తన సోదరుడు శవాన్ని ఆసుపత్రిలోనే వదిలెళ్లాడు. ఈ విషాద సంఘటన తెలంగాణలోని మంచిర్యాల జిల్లా కేంద్రంలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన మోతీషా(23) అనే యువకుడు ఏప్రిల్ 28న తన సోదరుడితో కలిసి రైలులో ప్రయాణిస్తుండగా.. తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో అతని సోదరుడు హుటాహుటిన మార్గమధ్యలోని బెల్లంపల్లి ఆసుపత్రికి తీసుకెళ్లాడు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి వైద్యుల సూచనల మేరకు మంచిర్యాలలోని జిల్లా ఆసుపత్రిలో చేర్పించాడు.
ఆసుపత్రిలో చేరిన రెండు గంటల్లోనే మోతీషా మృతి చెందాడు. వడదెబ్బతో మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. అయితే, శవాన్ని స్వస్థలానికి తీసుకెళ్లేందుకు తన సోదరుడు ఓ ప్రైవేటు ఆంబులెన్స్‌ను సంప్రదించగా.. చోదకులు రూ.80 వేల వరకు డిమాండ్ చేశారు. నిరుపేద కావడంతో అంత డబ్బు చెల్లించే స్థోమత లేక శవాన్ని ఆసుపత్రిలోనే వదిలి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి ఆ మృతదేహం ఆసుపత్రి మార్చురీలోనే అనాథగా పడి ఉంది. ఆసుపత్రి సిబ్బంది తన సోదరుడిని సెల్‌ఫోన్ ద్వారా సంప్రదించడానికి పలుమార్లు ప్రయత్నించినా స్పందించలేదు. దీంతో సిబ్బంది శనివారం పోలీసులకు సమాచారం అందించారు. మృతుడి కుటుంబసభ్యుల వివరాలు సేకరిస్తున్నట్లు ఆసుపత్రి నిర్వాహకులు తెలిపారు.
ఇదీ చదవండి: Paper leaks: ప్రశ్నపత్రాలను షేర్ చేసే వారిపైనా చర్యలు: ప్రభుత్వ పరీక్షల విభాగం