POLICE SOLVED THE THEFT CASE : అన్నం పెట్టిన కంపెనీకే కన్నం వేసి.. సొమ్ము కాజేసిన దొంగను గుంటూరు పోలీసులు పట్టుకున్నారు. జిల్లాలోని లాలుపురం రోడ్డులోని ఎస్కేటీ మిర్చి ఎగుమతుల కంపెనీలో రెండు రోజుల క్రితం రూ.20 లక్షల చోరీ జరిగింది. నగరంపాలెం పోలీసులు ఈ కేసులో ప్రధాన నిందితుడు గోనెల శంకర్‌ను అరెస్టు చేసి రూ.19.21 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మిర్చి కంపెనీలో ముఠా మేస్త్రిగా పనిచేస్తున్న గోనెల శంకర్ నమ్మకంగా ఉంటూ తన సమీప బంధువు పోతర్లంక నాగేశ్వరరావుతో కలిసి దొంగతనానికి పాల్పడ్డారు.
చోరీకి వెళ్లిన సమయంలో కుక్క అరిస్తే చికెన్ ముక్కలు వేసి.. వాచ్‌మన్‌పై దాడి చేసి నగదు దోచుకొని వెళ్లారు. పని పూర్తి చేసుకొని ఆనవాళ్లు గుర్తు పట్టకుండా కారం చల్లి అక్కడి నుంచి ఉడాయించారు. యూట్యూబ్‌లో వీడియోలు చూసి చోరీకి పాల్పడ్డారన్నారు. చోరీకి ఉపయోగించిన ఎలక్ట్రికల్ కట్టర్‌తో పాటూ ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడు నాగేశ్వరరావు పరారీలో ఉన్నాడని.. అతడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. కేసు ఛేదనలో చురుగ్గా పనిచేసిన అధికారులు, సిబ్బందికి ఎస్పీ తన చేతుల మీదుగా రివార్డులు ప్రదానం చేశారు.
అసలేం జరిగిందంటే: గుంటూరులోని వెంకటప్పయ్యకాలనీ లాల్‌పురం రోడ్డు చివర చోరీ జరిగిన మిర్చి ఎగుమతుల కంపెనీ ఉంది. ఇక్కడి నుంచి మలేషియాతో పాటు ఇతర ప్రాంతాలకు భారీ మొత్తంలో మిర్చి ఎగుమతి చేస్తుంటారు. శనివారం తెల్లవారుజామున 2 గంటల 30 నిమిషాల ప్రాంతంలో గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు ద్విచక్రవాహనంపై.. మిర్చి ఎగుమతి కంపెనీ వద్దకు వచ్చారు. వారు వచ్చిన వాహనశబ్దం విన్న కంపెనీ వాచ్మెన్ ఏవరని అరిచాడు. దీంతో వాచ్‌మెన్‌ను పట్టుకుని.. చేతులను తాళ్లతో కట్టేశారు. అరిస్తే చంపుతామని బ్లేడ్ చూపించి అతనిని బెదిరించారు. ఒక వ్యక్తి వాచ్మెన్ దగ్గర ఉండగా.. మరో వ్యక్తి కంపెనీ ద్వారానికి ఉన్న తాళాన్ని కట్‌చేసి లోపలికి వెళ్లాడు.
కంపెనీ గదిలో ఉన్న కప్బోర్డు తాళాన్ని తీసి అందులోని నగదును అపహరించుకుపోయారు. వారు బయటకు వెళ్తున్న సమయంలో అక్కడే ఉన్న కుక్క అరిచింది. దాని అరుపులు ఆపేందుకు వారు తెచ్చిన చికెన్ ముక్కలను వేసి అక్కడినుంచి ద్విచక్రవాహనంపై పారిపోయారు. రూ.20 లక్షలకు పైగా నగదు ఎత్తుకెళ్లారని కంపెనీ యాజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి.. ప్రధాన నిందితులను నేడు అరెస్ట్ చేశారు.
ఇవీ చదవండి: