Nirmal Minor Rape Case : తెలంగాణ రాష్ట్రం నిర్మల్‌లో సంచలనంగా మారిన బాలిక అత్యాచార ఘటనలో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడైన తెరాస నేత, మున్సిపల్ వైస్ ఛైర్మన్ షేక్ సాజిద్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. సాజిద్‌తో పాటు కారు డ్రైవర్ జాఫర్, మధ్యవర్తి అనురాధను అరెస్టు చేసినట్లు డీఎస్పీ ఉపేందర్ రెడ్డి తెలిపారు. నిర్మల్ మున్సిపాలిటీ పరిధి విశ్వనాథ్‌పేట్ నుంచి గత ఎన్నికల్లో తెరాస తరఫున కౌన్సిలర్‌గా సాజిద్‌ఖాన్ ఎన్నికయ్యారు. అనంతరం ఆయనకు మున్సిపల్ వైస్ ఛైర్మన్ పదవి దక్కింది.
ఏం జరిగింది?
నెల రోజుల క్రితం సాజిద్.... నిర్మల్‌కు చెందిన పదహారేళ్ల బాలికను షాపింగ్ పేరుతో హైదరాబాద్‌కు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. మూడు రోజుల క్రితం ఛైల్డ్‌లైన్ అధికారులను కలిసిన బాధితురాలు... తనకు జరిగిన అన్యాయాన్ని వివరించిందని వెల్లడించారు. వారు గ్రామీణ పోలీసులకు సమాచారం అందించడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు.... సాజిద్ ఖాన్, ఆయన వాహన డ్రైవర్, సహకరించిన అనురాధపై పోక్సో, అపహరణ, బెదిరింపులు కేసులు నమోదు చేశారు.
ముగ్గురు అరెస్ట్
పరారీలో ఉన్న ముగ్గురిని ఎట్టకేలకు అరెస్టు చేసినట్లు డీఎస్పీ ఉపేంద్ రెడ్డి తెలిపారు. షేక్ సాజిద్‌పై గతంలో పలు కేసులు ఉన్నాయని... రౌడీషీట్ సైతం తెరిచినట్లు చెప్పారు. కాగా... అత్యాచార ఆరోపణలు వచ్చిన వెంటనే స్పందించిన తెరాస అధిష్ఠానం.... నిందితుడిని పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు ప్రకటించింది.
Girls Missing: వసతి గృహం నుంచి ఇద్దరు బాలికలు మిస్సింగ్..ఏమైంది..!