NIA Raids: తెలంగాణలో పలుచోట్ల జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) సోదాలు జరుపుతోంది. నర్సింగ్ విద్యార్థిని రాధ అదృశ్యం కేసులో విచారణ జరుపుతోన్న ఎన్‌ఐఏ అధికారులు.. హైదరాబాద్ ఉప్పల్‌తో పాటు మెదక్ జిల్లా చేగుంటలో తెల్లవారుజాము నుంచి తనిఖీలు చేస్తున్నారు.
ఉప్పల్‌లోని హైకోర్టు న్యాయవాది శిల్ప ఉంట్లోనూ అధికారులు తనిఖీలు జరుపుతున్నారు. ఈ క్రమంలో శిల్పను అదుపులోకి తీసుకున్న అధికారులు.. మాదాపూర్‌లోని కార్యాలయానికి తరలించారు. రాధ మిస్సింగ్ కేసుకు సంబంధించి శిల్పను విచారించనున్నారు. అదే విధంగా.. చేగుంటలోని మావోయిస్టు అగ్రనేత దుబాషి శంకర్ కుమారుడు శంకర్ నివాసంలో ఎన్‌ఐఏ సోదాలు చేపట్టింది.
తమ కూతురు కిడ్నాప్‌నకు గురైందంటూ.. 2017 డిసెంబర్‌లో ఏపీలో విశాఖలోని పెద్దబాయిల పోలీస్ స్టేషన్‌లో రాధ తల్లి ఫిర్యాదు చేసింది. మావోయిస్టు అనుబంధ సంస్థ సీఎంఎస్ నాయకులు కిడ్నాప్ చేసి.. రాధను బలవంతంగా మావోయిస్టు పార్టీలో చేర్చుకున్నారని ఆరోపించింది. సీఎంఎస్ నాయకులు దేవేంద్ర, స్వప్న, శిల్ప తమ ఇంటికి వచ్చేవారని ఆమె వెల్లడించింది. వైద్యం పేరుతో దేవేంద్ర తమ కూతురిని తీసుకెళ్లారని రాధ తల్లి ఫిర్యాదు చేసింది.
రాధ అదృశ్యంపై విశాఖపట్నంలో మిస్సింగ్ కేసు నమోదు కాగా... రాధను నక్సల్స్‌లో చేర్చారని అడ్వకేట్ శిల్పపై ఆరోపణలు వచ్చాయి. దీంతో నర్సింగ్ విద్యార్థిని రాధ కేసు జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పగించారు. విశాఖలో నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా కేసు నమోదు చేసిన ఎన్‌ఐఏ... ఈ మేరకు విచారణ చేపట్టింది. ఇందులో భాగంగానే.. రాష్ట్రంలోని చేగుంట, ఉప్పల్‌లో ఏకకాలంలో సోదాలు జరిపింది.