Lucky Draw Fraud: తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలో భారీ మోసం బయటపడింది. లక్కీ డ్రా పేరుతో సామాన్యుల నుంచి లక్షలు దోచేశారు. నెలకు రూ.1100 చెల్లిస్తే ఆకర్షణీయమైన బహుమతులు ఇస్తామంటూ నమ్మించి నిండా ముంచేశారు. మండలానికి చెందిన సుమారు 150 మంది బాధితులు బోధన్ ఏసీపీ రామారావుకు ఫిర్యాదు చేశారు
lucky draw in nizamabad: లక్కీ డ్రాలో గెలిచిన వారికి కార్లు, ద్విచక్ర వాహనాలు, గృహోపకరణాలు, బంగారం, వెండి ఇస్తామని ఆశ కల్పించారు. బాధితులంతా 20 నెలలపాటు రూ.1100 చెల్లించినప్పటికి ఎలాంటి వస్తువులు రాకపోవడంతో మోసపోయామని గ్రహించి పోలీసులను ఆశ్రయించారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 3000 మంది బాధితులు ఉన్నట్లు తెలుస్తోంది.
రాయల్ ఎంటర్ప్రైజెస్ అనే పేరుతో కొత్త లక్కీ డ్రా స్కీమ్ పెట్టారు. ఇంటికొచ్చి మరీ డబ్బులు వసూలు చేశారు. దీన్ని నమ్మి మహిళలంతా నెలకు రూ.1100 కట్టారు. 20 నెలలు అయిపోయాక ఏదో ఒకటి వస్తుందని ఆశించారు. బహుమతులు రాకపోతే కనీసం డబ్బులు తిరిగి ఇస్తారని ఆశించారు. కానీ ఏజెంట్లు ఇప్పుడు స్పందించడం లేదు. ఇదీ మొత్తం కోట్ల రూపాయల స్కామ్ సార్. మండలంలో దాదాపు మూడు వేల మంది బాధితులు ఉన్నారు. పోలీసులు దీనిపై విచారణ జరిపి మాకు న్యాయం చేయాలి. - బాధితుడు
రూపాయి రూపాయి జమ చేసుకుని డబ్బులు కట్టినం. మన పిల్లలే కదా నమ్మినాం. ఇళ్లు లేవు, ఏం లేవు ఏదో ఒకటి వస్తాయని నమ్ముకుని డబ్బులు చెల్లించినాం. సాగర్ అనే వ్యక్తిని నమ్మి నెలకు రూ.1100ఇచ్చినాం సార్. మొత్తం 20 నెలలు కట్టినాం. మాకు మాత్రం ఏం ఇస్తలేరు. ఏమైనా చేసుకోపోరి అని బెదిరిస్తున్నర్రు. మీరే మాకు న్యాయం చేయాలి. - వృద్ధురాలు
lucky draw agents: లక్కీ డ్రా నిర్వాహకులు ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని సామాన్య ప్రజల వద్ద డబ్బులు వసూలు చేస్తున్నారు. తీరా గడువు ముగిసే సరికి
చేతులెత్తేస్తున్నారు. దీనితో బాధితులు ఒక్కొక్కరు సుమారు రూ.20 వేలకు పైగానే మోసపోతున్నారు. పోలీసులు ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.
నిజామాబాద్ గ్రూప్ అనే చెబితినే మేం డబ్బులు కట్టినాం. మేము అడిగితే మాకు సమాధానం చెప్తలేరు. సాగర్ అనే వ్యక్తి పైసలు వసూలు చేసుకుని పోయిండు. ఏం చేసుకుంటారో చేసుకోరి అంటున్నారు. అందుకే బోధన్ వరకు వచ్చినం. పోలీసులకు ఫిర్యాదు చేసినాం.
-మహిళ, బాధితురాలు