అనంతపురం కేంద్రంగా ఈబిడ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కార్యకలాపాలు కొనసాగించింది. ప్రజల నుంచి రూ.300 కోట్ల వరకు డిపాజిట్లు సేకరించింది. తిరిగి డబ్బులు చెల్లించకుండా బోర్డు తిప్పేసింది. నష్టపోయిన బాధితులు తమకు న్యాయం చేయాలని ముగ్గురు నాయకుల్ని వేర్వేరుగా ఆశ్రయించారు. నాయకులు ఆ సమస్యనే బంగారుబాతుగా మలుచుకున్నారు. మోసకారి సంస్థ నిర్వాహకుల్ని బెదిరించారు. కేసుల్లో ఇరికించేస్తామంటూ భయపెట్టారు. వారి రూ.కోట్ల విలువైన ఆస్తులను రాయించుకుని, ఖరీదైన వాహనాలను బహుమతులుగా తీసుకున్నారు. అనంతపురం, కడప జిల్లాలకు చెందిన ఆ నాయకుల వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
రూ.5 కోట్ల ఆస్తులు హాంఫట్
అనంతపురం జిల్లాకు చెందిన ఓ నాయకుడి పరిచయస్థులు కొందరు ఈబిడ్ సంస్థలో రూ.1.50 కోట్ల వరకు పెట్టుబడి పెట్టారు. ఈ విషయమై మాట్లాడేందుకు సంస్థ నిర్వాహకుల్ని పిలిపించుకున్న నాయకుడు వారికి సంబంధించిన రూ.5-6 కోట్ల విలువైన కొన్ని ఆస్తుల్ని తన అనుచరుల పేరిట రాయించుకున్నట్లు సమాచారం. ప్రతిగా సంస్థ నిర్వాహకులపై ఎలాంటి కేసులు లేకుండా చూస్తానని భరోసా ఇచ్చారన్న ప్రచారం ఉంది. అనంతపురం జిల్లాకే చెందిన మరో నాయకుడిని మరికొందరు బాధితులు కలిసి సమస్య విన్నవించారు. ఆయన కూడా సంస్థ నిర్వాహకుల్ని బెదిరించి, అత్యంత ఖరీదైన రెండు వాహనాలను బహుమతిగా తీసుకున్నట్లు సమాచారం. అనంతరం చోటుచేసుకున్న వివిధ పరిణామాల నేపథ్యంలో ఆ నాయకుడు వాటిని వెనక్కి ఇచ్చేయాల్సి వచ్చింది. ఈబిడ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, దాని ప్రతినిధి కడియాల సునీల్, ఇతరులపై నమోదైన కేసుల్ని దర్యాప్తు చేస్తున్న సీఐడీ ఆ వాహనాలను ఇటీవల సీజ్ చేసింది. మహారాష్ట్ర రిజిస్ట్రేషన్ కలిగిన ఆ వాహనాలు ప్రస్తుతం కర్నూలులోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయం ఆవరణలో ఉన్నాయి. ఇంకొందరు బాధితులు కడప జిల్లాకు చెందిన మరో నాయకుడిని కలిసి తమ సమస్య విన్నవించుకున్నారు. ఆయన సైతం మోసం చేసిన వారిని బెదిరించి, భారీగా లబ్ధి పొందినట్లు తెలిసింది.
అసలు ఏమిటీ ఈ-మోసం?
అనంతపురం వాసులైన కడియాల సునీల్, కడియాల సంతోష్ అన్నదమ్ములు. మహారాష్ట్రలోని నాగ్‌పుర్ కేంద్రంగా... ఈబిడ్ ట్రేడర్స్ పేరిట ఓ సంస్థను స్థాపించారు. నిరుడు దాన్ని ఈబిడ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌గా మార్చారు. కార్యాలయాన్ని అనంతపురంలోని రెవెన్యూ కాలనీలో తెరిచారు. తాము షేర్ మార్కెట్‌లో పెట్టుబడులు పెడతామని, ఎవరైనా సరే తమ సంస్థలో రూ.లక్ష పెట్టుబడి పెడితే వారికి నెలకు రూ.30 వేల చొప్పున చెల్లిస్తామంటూ ప్రచారం చేశారు. పెద్ద ఎత్తున ఏజెంట్లను నియమించుకుని... అనంతపురం, కర్నూలు, కడప జిల్లాలతోపాటు కర్ణాటక, మహారాష్ట్రలలో డిపాజిట్లు సేకరించారు. ముందు చెప్పినట్టుగానే కొన్నాళ్లపాటు వారికి నెలనెలా డబ్బులు చెల్లించారు. దాంతో అనేకమంది ఆకర్షితులై డబ్బులు కట్టారు. దాదాపు రూ.300 కోట్ల వరకు డిపాజిట్లు సమకూరాక సొమ్ముల చెల్లింపు ఆపేశారు. ఎవరైనా అడిగితే వివిధ కారణాలు చెప్పేవారు.
ఏపీలో 16 కేసులు నమోదు
ఈ ఏడాది ఏప్రిల్ రెండో వారంలో కొందరు బాధితులు... ఈబిడ్ సంస్థ తమను మోసగించిందంటూ అనంతపురం జిల్లా ఎస్పీకి ‘స్పందన’లో ఫిర్యాదు చేశారు. అదే నెలలో ధర్మవరం గ్రామీణ, బత్తులపల్లి, తాడిమర్రి, రామగిరి, అనంతపురం నాలుగో పట్టణం, ఆత్మకూరు, అనంతపురం ఒకటో పట్టణం, ఇటుకలపల్లి, సింగనమల, నార్పల పోలీసుస్టేషన్ల పరిధిలో మొత్తం 16 కేసులు నమోదయ్యాయి. వీటిల్లో కడియాల సునీల్‌తోపాటు మరో 17 మంది నిందితులుగా ఉన్నారు. వీటన్నింటినీ ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది. కేసులు నమోదైన వెంటనే సునీల్ పరారవగా... రక్షిస్తానని నమ్మబలికి ఓ నాయకుడు అతని నుంచి అత్యంత ఖరీదైన కార్లను బహుమతిగా పొందినట్లు తెలిసింది. సునీల్ మహారాష్ట్రలోనూ ఇదే తరహా మోసానికి పాల్పడటంతో అక్కడా అతనిపై ఓ కేసు నమోదైంది. ఆ కేసులో మహారాష్ట్ర పోలీసులు ఆగస్టు 7న అతన్ని అరెస్టు చేశారు. ఆ తర్వాత ఈ నెలలో సీఐడీ అధికారులు అతన్ని పీటీ వారెంట్‌పై ఆంధ్రప్రదేశ్‌కు తీసుకొచ్చారు. రెండు రోజులపాటు కస్టడీకి తీసుకుని విచారించారు.
ఇదీ చూడండి: Sirpurkar Commission Enquiry: దిశ కేసు.. '12 మంది కళ్లలో మట్టి కొట్టాడు'!