భూవివాదం రెండు ప్రాణాలను బలిగొన్నాయి. ఆస్తి కోసం మొదట అన్నను తమ్ముడు హత్య చేయగా..14 నెలల తర్వాత అన్న కుమారులు చిన్నాన్నను హత్య చేశారు. సంచలనం సృష్టించిన ఈ ఘటన కర్నూలు జిల్లా సిరివెళ్ల మండలం కోయిలకొండ గ్రామంలో జరిగింది.
వివరాల్లోకి వెళితే..
గ్రామానికి చెందిన గుర్రప్ప అనే వ్యక్తికి పెద్ద నాగేశ్వరరావు, చిన్న నాగేశ్వరరావు అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇరువురికి తనకున్న ఆస్తిలో 14 ఎకరాల చొప్పున గుర్రప్ప పొలాల్ని పంచాడు. గ్రామ సమీపంలోని చెరువు గట్టు పక్కనే ఉన్న సారవంతమైన ఒకటిన్నర ఎకరాన్ని ఎవరికీ గుర్రప్ప కేటాయించలేదు. ఆ పొలం విషయంలో ఇద్దరు అన్నదమ్ములు తరచూ గొడవలు పడేవారు. ఒకరు పంట వేయగా, మరొకరు పంటను నాశనం చేసేవారు. ఈ ఘర్షణల నేపథ్యంలో.. గత ఏడాది ఏప్రిల్ 5వ తేదీన పెద్ద నాగేశ్వరరావును తమ్ముడైన చిన్న నాగేశ్వరావు పొలంలోనే బలమైన ఆయుధంతో దాడి చేసి హత్య చేశాడు. ఈ ఘటనపై చిన్న నాగేశ్వరరావుపై సిరివెళ్ల పోలీస్ స్టేషన్లో హత్య కేసు నమోదైంది.
తాజాగా ఆదివారం పొలంలో ఉన్న చిన్న నాగేశ్వరావును.. గతంలో హత్యకు గురైన పెద్ద నాగేశ్వరావు కుమారులైన చిన్న గుర్రప్ప, పెద్ద గుర్రప్ప ఇనుప రాడ్డుతో దాడి చేసి హత్య చేశారు. ఒకటిన్నర ఎకరాల పొలం కోసం మొదట అన్న తర్వాత తమ్ముడు హత్యకు గురికావడం ఆ గ్రామంలో అలజడి రేపింది. ఘటనాస్థలాన్ని ఆళ్లగడ్డ డీఎస్పీ పరిశీలించారు.
ఇదీ చదవండి:
Viveka Murder Case: వివేకా ఇంటికి సీబీఐ అధికారులు..సునీత సమక్షంలో పరిశీలన
16 CRORE INJECTION: చిన్నారికి అరుదైన వ్యాధి.. ఇంజక్షన్‌కు రూ.16 కోట్లు కావాలి..!