Palvancha Family Suicide Case: తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి జిల్లా కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవేంద్రరావును అరెస్టు చేసినట్లు వచ్చిన వార్తలు నిజం కాదని కొత్తగూడెం పోలీసులు చెప్పారు. వనమా రాఘవ తమకు దొరకలేదని కొత్తగూడెం ఏఎస్పీ రోహిత్‌రాజ్ తెలిపారు. అతని కోసం తెలుగు రాష్ట్రాల్లో గాలిస్తున్నట్లు వెల్లడించారు. రాఘవపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి ఆధారాలు లభిస్తే రౌడీషీట్ నమోదు చేస్తామని వివరించారు. గతంలో నమోదైన కేసులపైనా దర్యాప్తు చేస్తామని పేర్కొన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య వ్యవహారంలో అతని సెల్ఫీ వీడియో సంచలనమైంది. ఆత్మహత్యకు ముందు రామకృష్ణ సెల్ఫీ వీడియో తీసుకున్నారు. ఆత్మహత్య నిర్ణయానికి దారి తీసిన పరిస్థితులను అందులో వివరించారు. ఆ వీడియోలో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవేంద్రరావుపై రామకృష్ణ తీవ్ర ఆరోపణలు చేశారు.
సెల్పీ వీడియోలో..
‘రాఘవ కారణంగా ఎన్నో కుటుంబాలు నాశనమయ్యాయి. అలాంటి దుర్మార్గులను రాజకీయంగా ఎదగనివ్వొద్దు. డబ్బు రూపంలో అడిగినా ఇచ్చేవాడిని. ఏ భర్త కూడా వినకూడని మాటను రాఘవ అడిగారు. నా భార్యను హైదరాబాద్ తీసుకురావాలని కోరారు. రాజకీయ, ఆర్థిక బలంతో పబ్బం గడుపుకోవాలని చూశారు. నేను ఒక్కడినే వెళ్లిపోతే నా భార్య, పిల్లలను వదిలిపెట్టరు. అందుకే నాతో పాటు వారినీ తీసుకెళ్తున్నా. అప్పుల్లో ఉన్న నాపై నా తల్లి, సోదరి కక్ష సాధించారు' అని నాగ రామకృష్ణ సెల్ఫీ వీడియోలో చెప్పారు.
ఎమ్మెల్యే వనమా స్పందన..
సుమారు 40 రోజులుగా ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్న తనకు.. పాల్వంచ ఘటన మనోవేదనకు గురిచేసిందని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తెలిపారు. ఇందులో తన కుమారుడు పాత్ర ఉందని వస్తున్న వార్తలతో మరింత క్షోభకు గురవుతున్నానని తెలిపారు. పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేశారని.. విచారణకు పూర్తిగా సహకరిస్తామని వెల్లడించారు. తన కుమారుడు రాఘవను పోలీసులకు అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు వివరించారు. రాఘవ నిర్దోశిత్వాన్ని నిరూపించుకునే వరకు నియోజకవర్గానికి దూరంగా ఉంచుతానని స్పష్టం చేశారు. పార్టీ కార్యక్రమాలకు కూడా రాఘవను దూరంగా ఉంచుతానన్నారు. ఉద్దేశపూర్వకంగా తనతో పాటు తెరాసపై ఆరోపణలు చేస్తున్నారని వనమా మండిపడ్డారు. పార్టీలు, వ్యక్తుల ఆరోపణలను తాను పట్టించుకోనని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు.
ఆది నుంచీ వివాదాస్పదమే..
వనమా రాఘవేంద్రరావుపై గతంలోనూ పలు ఆరోపణలు ఉన్నాయి. కొన్ని ఘటనల్లో కేసులు కూడా నమోదయ్యాయి. ప్రజాప్రతినిధి కుమారుడిగా వనమా.. రాజకీయ వారసుడిగా నియోజకవర్గంలో చక్రం తిప్పుతున్న రాఘవ తీరు ఆది నుంచీ వివాదాస్పదమే. పాల్వంచ గ్రామీణం, పట్టణ పోలీస్ స్టేషన్‌లలో ఇప్పటి వరకు మొత్తం ఆరు కేసులు నమోదయ్యాయి. పాల్వంచ గ్రామీణ పోలీస్ స్టేషన్ పరిధిలో వనమా రాఘవేందర్‌రావుపై పలు సెక్షన్ల కింద 2 కేసులు నమోదయ్యాయి. 2013లో ప్రభుత్వ ఉద్యోగి ఉత్తర్వులు ఉల్లంఘించి, ఎన్నికల్లో డబ్బులు ఎర వేశారని కేసు నమోదైంది. అదే ఏడాదిలో ప్రభుత్వ ఉద్యోగి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించి, విధులకు ఆటంకం కలిగించి దౌర్జన్యం చేశారంటూ కేసు ఉంది. పాల్వంచ పట్టణ పోలీస్ స్టేషన్‌లో నాలుగు కేసులు నమోదయ్యాయి. 2006లో ఓ వ్యక్తిని అక్రమంగా నిర్బంధించి అల్లరి మూకలతో కలిసి హంగామా చేశాడన్న ఆరోపణలపై కేసును ఎదుర్కొన్నాడు. 2017లో ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేసి ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించారని కేసు నమోదైంది. 2020లో ప్రభుత్వ ఉత్తర్వులను ధిక్కరించి, కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించారని కేసు పెట్టారు.
గిరిజన మహిళపై హత్యాయత్నం కేసులో..
2021లో ఆత్మహత్యకు పురిగొల్పారంటూ రాఘవపై కేసు నమోదైంది. పలువురి ఆత్మహత్యలకు సంబంధించి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్నాడు. గిరిజన మహిళ జ్యోతికి చెందిన స్థలం వివాదంలో రాఘవేంద్రరావు అనుచరులు ఆమెపై భౌతికదాడికి పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. గిరిజన మహిళపై హత్యాయత్నం కేసులో రాఘవేంద్రరావు ప్రధాన ఆరోపణలు ఎదుర్కొన్నాడు. ఈ కేసు ఎస్సీ, ఎస్టీ కమిషన్ వరకూ వెళ్లడం సంచలనం రేపింది. పాల్వంచకు చెందిన ఫైనాన్స్ వ్యాపారి వెంకటేశ్వర్లు ఆత్మహత్య కేసులో ఏ1 నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొన్నాడు. దాదాపు 20 రోజుల పాటు అజ్ఞాతంలోకి వెళ్లి హైకోర్టులో స్క్వాష్ పిటిషన్ దాఖలు చేసి కేసు నుంచి బయటపడ్డాడు. తాజాగా రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులోనూ ఏ2గా రాఘవేంద్రరావుపై పోలీసు కేసు నమోదైంది. అజ్ఞాతంలో ఉన్న అతన్ని సెల్ఫీ వీడియో బయటకులాగింది.
విమర్శలకు కొదవలేదు...
అనేక వివాదాలకు కేంద్ర బిందువుగా మారాడని.. వనమా రాఘవేంద్రరావుపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొత్తగూడెం నియోజకవర్గంలో పేరుకే తండ్రి వనమా వెంకటేశ్వరరావు ఎమ్మెల్యే అని.. అంతా కుమారుడిదే రాజ్యంగా సాగుతోందన్న విమర్శలకు కొదవలేదు. నియోజకవర్గాన్ని తన కనుసన్నల్లో నడిపిస్తారన్న ఆరోపణలు ఆది నుంచీ ఎదుర్కొంటున్నాడు. పార్టీని, ప్రభుత్వాన్ని గుప్పిట్లో పెట్టుకుని అధికార యంత్రాంగంపై పెత్తనం చెలాయిస్తాడని వనమా రాఘవపై ఆరోపణలు ఉన్నాయి. నియోజకవర్గంలో వ్యక్తిగత పంచాయితీల నుంచి భూవివాదాలు, సెటిల్మెంట్లలో రాఘవ జోక్యం చేసుకోవడంతో వివాదస్పదమైన సంఘటనలు అనేకం గతంలోనూ వెలుగులోకి వచ్చాయి.
ఇదీ చదవండి: