husband killed his wife : విజయనగరం జిల్లా కొత్తవలస మండలం జోడిమెరకలో దారుణం జరిగింది. భార్యను హత్య చేసి... ఆ విషయం బయటకి తెలియకుండా ఉంచేందుకు దహనం చేశాడు ఓ కిరాతకుడు. ఆపై తన భార్య కనిపించటం లేదని పోలీసులను అశ్రయించాడు. పోలీసుల దర్యాప్తులో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
ప్రేమ వివాహం..
జోడిమెరకు చెందిన జోడి నాగరాజు.. శ్రీకాకుళంజిల్లా రాజంకు చెందిన లక్ష్మీ(28)ని ఎనిమిదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. లక్ష్మీ, నాగరాజు దంపతులకు ఒక కుమారుడు జన్మించాడు. గత నెల 30వ తేదీ నుంచి తన భార్య లక్ష్మీ కనిపించటం లేదని నాగరాజు.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆచూకీ తెలపాలంటూ పోలీసు స్టేషన్ చుట్టూ తిరిగాడు.
అనుమానంతో...
నాగరాజు ప్రవర్తనపై అనుమానం వచ్చిన స్థానికులు నిఘా పెట్టారు. మరో మహిళతో సన్నిహితంగా ఉంటూ.. లక్ష్మీని హత్య చేసినట్లు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. నాగరాజును అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. భార్యను హత్య చేసినట్లు అంగీకరించాడని పోలీసులు తెలిపారు. హత్యలో ఇతరుల పాత్ర ఏమైనా ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కఠినంగా శిక్షించాలి..
నాగరాజుని కఠినంగా శిక్షించాలంటూ జోడిమెరకకు చెందిన మహిళలు కొత్తవలసలో ర్యాలీ నిర్వహించారు.
ఇదీ చదవండి