Aunt killed her daughter-in-law.. రాయచోటిలో కోడలిని అత్త నరికి చంపడం సంచలనం సృష్టించింది. అత్యంత కిరాతకంగా హత్య చేసి.. తలను పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లడం కలకలం రేపింది. కుటుంబ కలహాలు, ఆస్తి వివాదాలే ఘటనకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. నిందితురాలిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.
Murder.. అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలో దారుణ హత్య జరిగింది. రాయచోటిలోని కె.రామాపురం ప్రాంతంలో నివాసం ఉంటున్న వసుంధరను.. సొంత అత్త చెల్లెలు సుబ్బమ్మ కిరాతకంగా నరికి చంపింది. గురువారం మధ్యాహ్నం కోడలిని ఇంట్లోకి పిలిచిన అత్త.. మరో వ్యక్తితో కలిసి కత్తులు, కొడవళ్లతో దాడి చేసింది. పాశవికంగా వసుంధర తల, మొండం వేరు చేసింది. అనంతరం వసుంధర తలను పట్టుకుని నడుచుకుంటూ పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. ఆ తర్వాత పోలీసుల సూచనతో ఇంటికి తిరిగొచ్చి... మొండెం దగ్గర తలను ఉంచింది.
ఈ కిరాతక హత్యతో వసుంధర ఇద్దరు పిల్లలు కన్నీరుమున్నీరయ్యారు. ఆస్తి కోసం తల్లిని చంపేశారంటూ బోరున విలపించారు. ఇప్పటికే తండ్రిని కోల్పోయిన తాము.. ఇప్పుడు తల్లిని కూడా పోగొట్టుకున్నామని గుండెలు బాదుకున్నారు. ఇక తమకు దిక్కెవరంటూ ప్రశ్నిస్తున్న ఆ చిన్నారుల్ని ఓదార్చడం ఎవరి వల్లా కాలేదు. హత్య జరిగిన ఇంటిని డీఎస్పీ శ్రీధర్, ఇతర పోలీసు అధికారులు పరిశీలించారు. కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
కలకడ మండలానికి వసుంధరకు పదిహేనేళ్ల కిందట రాయచోటికి చెందిన రాజాతో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. పదేళ్ల కిందట రోడ్డు ప్రమాదంలో రాజా మృతి చెందాడు. ఆ తర్వాత ఆయన తల్లి కూడా చనిపోయింది. అప్పటినుంచి ఇద్దరు పిల్లలు, చిన్నత్త సుబ్బమ్మతో కలిసి వసుంధర జీవనం సాగిస్తోంది. అయితే వసుంధర పేరిట ఉన్న ఇల్లు, భూములు, ఇతర ఆస్తులపై కన్నేసిన సుబ్బమ్మ.. తరచూ ఆమెతో గొడవ పడేదని స్థానికులు చెబుతున్నారు. అలాగే వసుంధర వివాహేతర సంబంధం పెట్టుకుందని సుబ్బమ్మ ఆరోపిస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో.. కోడలిని అత్త చంపేసిందని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.
ఇవీ చదవండి: