నీకెంత ధైర్యం.. నీకు అక్కా చెల్లెళ్లు లేరా? అమ్మాయిని వేధిస్తావా? ఇక నీ పని అయిపోయింది. భవిష్యత్తులో ఉద్యోగం రాదు. జీవితాంతం ఊచలు లెక్కపెడుతూనే ఉండాలంటూ బెదిరించారు. సెటిల్‌మెంట్ చేసుకో.. లేదంటే అరెస్ట్ తప్పదు. ఆ అమ్మాయితో మేం మాట్లాడతామంటూ కొందరు కేటుగాళ్లు పెద్ద మనుషులుగా వ్యవహరించి ఓ నిరుద్యోగి నుంచి రూ.6.96 లక్షలు కాజేసిన(New Trend in Cyber Crimes) వైనం వెలుగు చూసింది. ఈ కేసును తెలంగాణలోని సైబరాబాద్ సైబర్‌క్రైమ్(Hyderabad Cyber Crime Police) పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
నువ్వు రాకపోతే పోలీసులే వస్తారు
ఐడీఏ జీడిమెట్లకు చెందిన బాధితుడు(27) ఎంఎస్సీ చదివి ఉద్యోగాన్వేషణలో ఉన్నాడు. రిక్రూట్‌మెంట్ వెబ్‌సైట్లలో వివరాలు నమోదు చేసుకున్నాడు. కొన్ని రోజుల కిందట crpccrime@gmail.com అనే ఐడీ నుంచి మెయిల్ వచ్చింది. మీరొక అమ్మాయిని వేధించారని.. మీపైన 356(ఏ) సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. అమ్మాయితో ఉన్నట్లు బాధితుడి ఫొటోలను మార్ఫింగ్(Photo morphing) చేశారు. యువతిని బెదిరించావని చెప్పారు. ఆ అమ్మాయి తనకు తెలియదంటూ బాధితుడు వాపోయాడు. అయినా సెప్టెంబర్ 10న మ. 12 గంటలకు తల్లిదండ్రులను తీసుకురావాల్సి ఉంటుందని హెచ్చరించారు. హాజరు కాకపోతే పోలీసులే వెతుక్కుంటూ వస్తారని తేల్చి చెప్పారు.
ఇబ్బందులొద్దంటే ‘సెటిల్’ చేసుకో..
మెయిల్ చూశాక బాధితుడికి ఏం చేయాలో అర్థం కాకా మిత్రుడి సలహా కోరాడు. అక్కడున్న నంబర్‌కు కాల్ చేసి వివరాలు తెలుసుకోమని సూచించగా, కాల్ చేశాడు. అవతలి వ్యక్తులు పోలీసులమంటూ పరిచయం చేసుకున్నారు. ఆ అమ్మాయితో సెటిల్ చేసుకోమన్నారు. వాళ్ల బంధువులు ఫోన్ చేస్తారని చెప్పారు. నలుగురు ఫోన్లు చేశారు. వాళ్లు అడిగినప్పుడల్లా సెప్టెంబర్ 10 నుంచి అక్టోబర్ 3 మధ్య దఫదఫాలుగా రూ.6.96 లక్షలు పంపించాడు. కేసు కొట్టేశారా.. లేదా..? అని తెలుసుకునేందుకు ఫోన్లు చేయగా స్విచ్ఛాఫ్ అని రావడంతో పోలీసులను ఆశ్రయించాడు.
రోజురోజుకు సైబర్ కేటుగాళ్ల ఆగడాలు ఎక్కువవుతున్నాయని పోలీసులు చెబుతున్నారు. వారి బారిన పడుతున్న వారిలో ఎక్కువ యువతే ఉంటోందని తెలిపారు. సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయడానికి నిరంతరం తాము శ్రమిస్తున్నామని.. కానీ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.