ATTACK: విశాఖ జిల్లా పెందుర్తి మండలం వి.జుత్తాడలో అమానుషం చోటు చేసుకుంది. ఒక దళిత యువకుడిని మరో దళిత వ్యక్తి చెట్టుకు కట్టేసి చెప్పుతో కొట్టిన ఘటన తీవ్ర కలకలం రేపింది. వారం రోజుల క్రితం జరిగిన ఈ ఘటన బుధవారం వెలుగుచూసింది. పెందుర్తి పోలీసులు, గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. వి.జుత్తాడకు చెందిన తారకేశ్వరరావు, సూరిబాబు గ్రామంలోని ఓ వైకాపా నాయకుడికి ముఖ్య అనుచరులు. వారం క్రితం తారకేశ్వరరావు మద్యం తాగి వైకాపా నాయకుడిని అసభ్య పదజాలంతో దూషించి, అట్రాసిటీ కేసు పెడతానని బెదిరించాడు. మర్నాటి ఉదయం తన సెల్‌ఫోన్ దొంగిలించాడన్న ఆరోపణతో తారకేశ్వరరావును సూరిబాబు చెట్టుకు కట్టి చెప్పుతో కొట్టి, అసభ్య పదజాలంతో దూషించాడు. వైకాపా నాయకుడిని తిట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని విరుచుకుపడ్డాడు. మంగళవారం రాత్రి మళ్లీ ఇద్దరి మధ్య వివాదం జరిగింది. సూరిబాబును చంపేస్తానని తారకేశ్వరరావు బెదిరించినట్లు గ్రామస్థులు చెబుతున్నారు. సూరిబాబు కూడా తారకేశ్వరరావుపై కేసు పెడతానని హెచ్చరించినట్లు తెలిసింది. దాంతో పాత ఘటన వీడియోలు బయటకు వచ్చాయి. ఈ ఘటన స్థానిక ఎంపీటీసీ సభ్యుడి ఇంటి సమీపంలోనే జరగడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
సెల్‌ఫోన్ దొంగిలించాడనే దాడి: తన సెల్‌ఫోన్‌ను తారకేశ్వరరావు దొంగిలించాడనే సూరిబాబు అతడిని చెట్టుకు కట్టేసి కొట్టినట్లు పెందుర్తి సీఐ అశోక్‌కుమార్ తెలిపారు. వీడియో కలకలం రేపిన నేపథ్యంలో గ్రామంలో విచారణ చేశామన్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు నిందితుడు సూరిబాబుపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు.
ఇవీ చదవండి: