గుంటూరు జిల్లా బాపట్ల బ్యాంక్ ఆఫ్ బరోడాలో బంగారం చోరీ కేసుని పోలీసులు ఛేదించారు. బ్యాంకులో అటెండర్‌గా పనిచేసే సుమంత్ రాజు అనే వ్యక్తే బంగారం కాజేశాడని పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు నిందితుడిని అరెస్టు చేశారు. సుమంత్ రాజు నుంచి 6 కిలోల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు బాపట్ల డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు.
వినియోగదారులు బ్యాంకులో తాకట్టు పెట్టిన బంగారం స్ట్రాంగ్ రూంలో ఉండేది. మేనేజర్‌తో కలిసి స్ట్రాంగ్ రూంలోకి వెళ్లినప్పుడు సుమంత్ రాజు చాకచక్యంగా బంగారు ఆభరణాలు చోరీ చేసేవాడు. ఇలా రెండేళ్లుగా 6 కిలోల మేర ఆభరణాలు ఎత్తుకెళ్లాడు. వాటిని మణప్పురం, ముత్తూట్ ఫైనాన్స్‌లో తాకట్టు పెట్టి డబ్బు తీసుకునేవాడు. ఇలా రూ. 2 కోట్ల 30 లక్షల మేర రుణాన్ని ఫైనాన్స్ సంస్థల నుంచి పొందాడు. ఈ వ్యవహారంలో సుమంత్ రాజు స్నేహితులు, అశోక్, కిషోర్ ప్రమేయం కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. బంగారం తాకట్టు పెట్టగా వచ్చిన డబ్బుతో జల్సాలు చేశారు. కొంత మేర బ్యాంకుల్లో దాచారు. అన్నింటినీ రికవరీ చేసినట్లు డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. నిబంధనల ప్రకారం ఆభరణాలు వాటి యజమానులకు అప్పగించేలా చర్యలు తీసుకుంటామన్నారు.
ఇదీ చదవండి: Fake PA: మంత్రి పీఏల పేరుతో మోసం.. ఇద్దరు అరెస్టు