తనకు వారసత్వంగా లభించిన భూమిని కొందరు ఆక్రమించారని.. దానిపై ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం తహసీల్దారు కార్యాలయం వద్ద జరిగింది.
బయ్యారం మండలం రామచంద్రాపురానికి చెందిన ఇస్లావత్ వసంతరావుకు సర్వే నంబర్ 60/ 30లో ఆరెకరాలు తన తండ్రి లింబియా నుంచి వారసత్వంగా లభించింది. ఆ భూమిని కొందరు ఆక్రమించుకున్నారని.. తన భూమిలో తాను సాగు చేసుకుందామంటే ఆక్రమణదారులు అడ్డుకుంటున్నారని వాపోయాడు. ఈ విషయమై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నాడు. ఇవాళ ఉదయం తహసీల్దారు కార్యాలయానికి వచ్చి తన భూమి విషయమై.. తహసీల్దారు నాగభవానితో వాగ్వాదానికి దిగాడు. తనకు న్యాయం చేయాలంటూ వెంట తెచ్చుకున్న పెట్రోల్ బాటిల్ తీసి కొంచెం తాగి.. మిగిలినది మీద పోసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని బాధితుడిని ఆస్పత్రికి తరలించారు.
ఊళ్లో లేనప్పుడు..
తాను గత కొంతకాలంగా బతుకుదెరువు కోసం వేరే రాష్ట్రంలో ఉంటున్నానని. ఆ సమయంలోనే తన భూమిని ఆక్రమించారని వాపోయాడు. ఈ విషయమై ఏడాది కాలంగా తహసీల్దారు కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా అధికారులు స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.