విశాఖ - విజయనగరాలు జంట నగరాలుగా అభివృద్ధి అవుతాయని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. భోగాపురం విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. విశాఖలో పార్క్ అభివృద్ధి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విశాఖ - భోగాపురం అనుసంధానిస్తూ 70 మీటర్ల విస్తీర్ణంతో రహదారి నిర్మాణం చేపడుతున్నట్లు పేర్కొన్నారు. రోడ్డుపై వాహనాలు ప్రయాణించే సమయం, వేగం, నిర్దిష్ట ప్రమాణాలను.. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ, రహదారులు అభివృద్ధి శాఖ నిశితంగా పర్యవేక్షించి అభివృద్ధి నిధులను అందిస్తాయని తెలిపారు. ఈ రహదారి నిర్మాణానికి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఇప్పటికే సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిపారు.
భోగాపురం విమానాశ్రయం అభివృద్ధి జరిగిన తరువాత.. ప్రస్తుత విశాఖ ఎయిర్ పోర్ట్ రక్షణ రంగ శాఖకు సంబంధించినందున దానిని పూర్తి స్థాయిలో వారికి అప్పగించనున్నట్లు విజయసాయి స్పష్టం చేశారు. పురుషోత్తపట్నం నుంచి విశాఖకు తాగునీరు బృహత్తర కార్యక్రమం త్వరలోనే పూర్తికానున్నట్లు వెల్లడించారు. విశాఖను అద్భుత నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకెళుతోందని ఎంపీ చెప్పారు.
ఇదీ చదవండి:
GVMC commissioner: ఆసక్తి రేపుతున్న జీవీఎంసీ కమిషనర్ సృజన ట్వీట్