మంచి పుస్తకాన్ని మించిన నేస్తం లేదు అంటారు. పుస్తకాలు చదివితే కలిగే విజ్ఞానం, లోక జ్ఞానం వెలకట్టి చూడలేం. అందుకే విజయాల్ని సాధించిన వారంతా పుస్తక ప్రేమికులై ఉంటారు. ఏ కాస్త సమయం చిక్కినా పుస్తకాలు చదువుతూ అందులో లీనమైపోతారు. అయితే ప్రస్తుత తరానికి చెందిన యువతీ, యువకుల్లో సాహిత్యంపై ఆకర్షణ.. పుస్తకాలు చదవడంపై ఆసక్తి కాస్త తక్కువ అనే అభిప్రాయం ఉంది. కొవిడ్ మహమ్మారి కారణంగా కనిపిస్తున్న కొన్ని సానుకూల ప్రభావాల్లో ఈ పుస్తక పఠనం కూడా ఒకటి ఉందని చెప్పాలి. ఇప్పుడు సాహిత్య పుస్తకాలు చదివే దిశగా యువత అమితమైన ఆసక్తిని కనబరుస్తున్నారు.
కొవిడ్ ప్రభావం ఈ మార్పుకి కారణమైంది. విద్యార్థులు ఆన్లైన్ తరగతులకు పరిమితం కావడంతో వారికి చేతిలో సమయం పుష్కలంగా ఉంటోంది. ఇంటి దగ్గర ఉంటున్నా.. కాలాన్ని మాత్రం వృథాగా పోనీయకుండా జాగ్రత్త పడుతున్నారు. భాషా నైపుణ్యం, సాహిత్యంపై పట్టు సాధించాలన్న తపనకు తోడు తల్లిదండ్రులు ప్రోత్సహిస్తుండడంతో చక్కగా పుస్తకాలను చదివేస్తున్నారు.
విద్యార్థులను పుస్తక పఠనం దిశగా మరింత ప్రోత్సహించేందుకు విశాఖలోని కొన్ని పుస్తకాల దుకాణాలు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి. పుస్తక ప్రేమికులు చక్కగా కూర్చుకుని చదువుకునేందుకు ఏర్పాట్లు చేశారు. యువతీ, యువకులు పుస్తకాలను ఇంటికి తీసుకువెళ్లి చదువుకునేందుకు సైతం ఉచితంగా అవకాశం కల్పిస్తున్నారు.
పుస్తకాలు కాలక్షేపం కోసం కాకుండా జీవితంలో ఎన్నో తెలియని కొత్త విషయాలను తెలిపేందుకు, సరికొత్త అంశాలపై పట్టు పెంచేందుకు ఎంతగానో ఉపయోగపడే విధంగా ఎంపిక చేసుకుంటున్నామని యువత చెబుతోంది.
ఇదీ చదవండి: సలాం కుటుంబానిది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే: చంద్రబాబు