విశాఖ నగర ప్రజలు నాలుగైదేళ్లలో ఎన్నడూ లేనంతగా నీటి కష్టాలు ఎదుర్కొంటున్నారు. అసలే వేసవిలో నీటి ఎద్దడి... దానికితోడు ఏలేరు కాల్వకు గండి పడటం వల్ల నీటి సమస్య తీవ్రమైంది. ఈ కాల్వ నుంచే తాగునీరు, పరిశ్రమల అవసరాలకు సరఫరా అవుతాయి. ఒక్కసారిగా ఆగిపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. కాల్వకు మరమ్మతులు కొనసాగుతున్నా... ఇంకా రెండు రోజులదాకా పునరుద్ధరించే పరిస్థితి కనిపించడం లేదు.
రోజుకు 30 నిమిషాలపాటు సరఫరా అయ్యే జీవీఎంసీ నీటిపైనే నగర ప్రజలు ఆధారపడాల్సి వస్తోంది. ఏలేరు నుంచి వచ్చే నీటికి అంతరాయం కలగడం వల్ల ట్యాంకర్ల ద్వారా కూడా నీటిని సరఫరా చేయలేని పరిస్థితి నెలకొంది. భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటి పోవడం వల్ల బోర్లు కూడా పని చేయడం లేదు. ఎక్కడో ఒక్క బోరులో నీరు వచ్చినా.... అదీ పూర్తిగా ఎర్రరంగులో మట్టి నీళ్లే వస్తున్నాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.
త్వరితగతిన ఏలేరు కాల్వకు మరమ్మతులు పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు. జలాశాయాల్లో నీటి నిల్వ, భూగర్భ జలాల పెంపొందిండడంలో నిర్లక్ష్య వైఖరే సమస్యను మరింత సంక్లిష్టం చేసిందని వాపోతున్నారు.
ఇవీ చూడండి: అన్నవరం దేవస్థానానికి 'ఐఎస్ఓ' గుర్తింపు