నగరంలో మొత్తంగా 1172 కిలోమీటర్ల పొడవునా గెడ్డలున్నాయి. ఇందులో వర్షపునీటిని సముద్రంలోకి పంపే అత్యంత ప్రధాన గెడ్డలు 187 కిలోమీటర్ల మేర ఉన్నాయి. గత కొన్నేళ్లుగా జీవీఎంసీ అధికారులు కేవలం 47 కిలోమీటర్ల మేరకే ఆధునికీకరించారు. అంటే.. రక్షణ గోడలు నిర్మించడం, అడుగున కాంక్రీటు వేయడంలాంటివి చేశారు. మిగిలిన గెడ్డలు ఇప్పటికీ ఇబ్బందికరంగానే ఉన్నాయి. గెడ్డ చుట్టుపక్కల ప్రాంతాలు, రోడ్లు, కాలనీలు.. సుమారు గంట నుంచి రెండుగంటలపాటూ మురుగునీటితోనే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.
నరగంలోని ప్రధాన గెడ్డలన్నీ టెండర్ల ద్వారానే నిర్వాహణ చేస్తున్నారు. మిగిలిన మధ్య తరహా, చిన్న గెడ్డల్ని, కాలువల్ని మాత్రం జోనల్‌స్థాయి అధికారుల ఆధ్వర్యంలో రోజువారీ పనులు చేపడుతున్నారు. నగరవ్యాప్తంగా రోజూ 1100 టన్నుల చెత్త ఈ గెడ్డలు, కాలువలనుంచే బయటికొస్తున్నట్లు అంచనాలున్నాయి. ప్రస్తుతానికి 8 జోన్లలోనూ 8 జేసీబీలున్నాయి. 16మంది ఆపరేటర్లున్నారు. వీరే కాస్త పెద్దగా ఉన్న కాలువల్ని క్లియర్ చేయాలి. 800 మంది పారిశుద్ధ్య సిబ్బందిని కాలువల నిర్వాహణకు కేటాయించినా మంచి ఫలితాలు రావడంలేదు. దీంతో జీవీఎంసీ అధికారులు తలలు పట్టుకునే పరిస్థితి దాపురించింది.
గత కొన్నినెలలుగా చూస్తే.. కనీసం 4 సెంటీమీటర్లు వర్షం పడినా నగరంలోని గెడ్డలు, కాలువలు పొంగడం కనిపిస్తోంది. గంగులగెడ్డ, ఎర్రిగెడ్డ పొంగడం ద్వారా జ్ఞానాపురం, బాబూకాలనీలతో పాటు.. పాతనగరంలోని చుట్టుపక్కల ప్రాంతాలు చాలా వరకు మునకకు గురవుతున్నాయి. బీచ్ రోడ్డుద్వారా సముద్రంలోకి పలు గెడ్డలు వెళ్తుండటంతో భారీవర్షంపడ్డ ప్రతీసారీ బీచ్‌రోడ్డులోని చాలాభాగం మునిగిపోవడం తరచూ కనిపిస్తోంది. పూర్ణామార్కెట్, స్ప్రింగ్‌రోడ్డు, వుడ్‌యార్డ్‌స్ట్రీట్, ఇందిరా ప్రియదర్శిని స్టేడియం చుట్టుపక్కల ప్రాంతాలు, తాటిచెట్లపాలెం, రైల్వేన్యూకాలనీ, నరవ, పెందుర్తి, తదితర ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. గెడ్డల నిర్వహణలో కొన్ని కీలక లోపాలు కూడా బయటపడుతున్నాయి.
నగరంలోని హనుమంతవాక, ఎంవీపీకాలనీ, కంచరపాలెం తదితర ప్రాంతాల్లో గెడ్డల ఆక్రమణలు భారీగా ఉన్నాయి. వాటిని ముట్టుకునేందుకు అధికారులు జంకుతున్నారు. ఎన్ని ఆక్రమణలున్నదీ ఇప్పటిదాకా సర్వేచేయలేదు. గెడ్డలు పొంగడానికి ప్రధాన కారణం.. చెత్తాచెదారం తీవ్రంగా పేరుకుపోవడం, పూడిక సరైనరీతిలో తీయకపోవడం. ఈ నిర్వాహణలోపం నగరానికి శాపంగా మారిందనే చెప్పాలి. గెడ్డల్లో చెత్తపడకుండా పలుచోట్ల ఐరన్‌గ్రిల్స్ పెట్టినా నిర్వాహణ సరిగాలేక.. వాటికి పెట్టిన ఖర్చుతో ఫలితాలు రావడంలేదు. విశాఖ పోర్టు సమీపంలోని బాగా పెద్దదైన గంగులగెడ్డ దుస్థితి చాలా దారుణంగా ఉంది. గత కొన్నాళ్లుగా సుమారు 400 మీటర్ల మేర చెత్త నిండుగా పేరుకుపోయింది.
ఇదీ చదవండి:
3 TIER ECONOMY COACHES: త్రీటైర్ ఎకానమీ పేరుతో ఏసీ కోచ్‌ల తయారీ