డిసెంబరు వచ్చిందంటే ప్రజలందరి చూపు విశాఖ ఉత్సవాలపైనే ఉంటుంది. వైభవంగా నిర్వహించే ఈ సంబరాలు ఈ ఏడాది నిర్వహించడం అనుమానంగా కనిపిస్తోంది. ప్రభుత్వం ఏటా ఉత్సవాలకు ముందుగానే తగు ఏర్పాట్లు చేస్తుంది. ఈ ఏడాదికి ఎప్పుడు నిర్వహించాలనే అంశంపై ఇప్పటి వరకు ఎటువంటి ఆదేశాలు రాలేదు.
* కొవిడ్-19 నిబంధనలు, కరోనా మహమ్మారి ప్రమాదం పొంచి ఉండడంతో ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ఈ ఏడాది ఉత్సవాలకు దూరంగా ఉండే అవకాశం కనిపిస్తోంది. గత ఏడాది నవంబరు 9, 10 తేదీల్లో రూ.50 లక్షలతో భీమిలి ఉత్సవాలు, రూ.2 కోట్లతో డిసెంబరు 28, 29న విశాఖ ఉత్సవ్, ఈ ఏడాది ఫిబ్రవరి 15,16న అరకు ఉత్సవాలను రూ.కోటితో నిర్వహించారు.
* గత రెండేళ్లుగా నవంబరులో భీమిలి ఉత్సవాలు నిర్వహిస్తుండగా మరో వారంలో ఈ నెల ముగియనుండడంతో ఈసారి నిర్వహించకపోవచ్ఛు విశాఖ ఉత్సవాల నిర్వహణపై మాత్రం సందిగ్ధత నెలకొంది.
* రాష్ట్ర ప్రజలంతా ఉత్సాహంగా ఎదురు చూసే ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలా వద్దా అనేది త్వరలో జరిగే మంత్రి మండలిలో నిర్ణయించే అవకాశం కనిపిస్తోంది.
* ఈ ఉత్సవాల అంశంపై పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావును ‘ఈనాడు’ వివరణ కోరగా ‘కేబినెట్’ సమావేశంలో ముఖ్యమంత్రి దృష్టికి ఉత్సవాల నిర్వహణ విషయాన్ని తీసుకువెళతాం. కొవిడ్ పరిస్థితులు, ఇతర అంశాలను దృష్టిలో పెట్టుకొని మంత్రిమండలి సమావేశంలో చర్చించిన తరువాత ముఖ్యమంత్రి సూచన మేరకు నిర్ణయం తీసుకుంటాం’ అని వివరించారు.
ఇదీ చదవండి: