ఈ నెల 16 నుంచి ప్రారంభించనున్న కొవిడ్ వ్యాక్సినేషన్‌కు పక్కాగా ఏర్పాట్లు చేయాలని.. విశాఖ కలెక్టర్ వినయ్ చంద్ అధికారులను ఆదేశించారు. టీకాలు ఇప్పటికే జిల్లాకు చేరగా.. సన్నద్ధతపై అధికారులతో ఆయన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశానుసారం.. మొదటి విడతలో ఆరోగ్య సిబ్బందికి వ్యాక్సిన్ వేస్తామని తెలిపారు. నియోజకవర్గానికి రెండు చొప్పున జిల్లా వ్యాప్తంగా 32 కేంద్రాలలో.. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 వరకు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. యాప్‌లో నమోదు చేసుకున్న ఆరోగ్య సిబ్బందికే టీకా అందించనున్నట్లు వెల్లడించారు.
ప్రతి మండలంలో తహసీల్దార్, ఎంపీడీవో, ఎస్సైతో కలిపి.. కొవిడ్ కమిటీ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. అవసరమైన సిబ్బందిని నియమించుకొని పగడ్బంధీగా కార్యక్రమం పూర్తి చేయాలని ఆదేశించారు. శుక్రవారం నాటికి సంబంధిత కేంద్రాలకు వ్యాక్సిన్ చేరేలా చూడాలన్నారు. వ్యాక్సినేషన్ కేంద్రాల్లో నిరంతరం విద్యుత్ సరఫరా, ఇంటర్నెట్ సౌకర్యం తప్పక ఉండే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు, అంబులెన్స్, ఏఈఎఫ్ఐ కిట్లు సిద్ధంగా ఉంచాలని చెప్పారు. యాప్‌లో నమోదు కాని వారికి వ్యాక్సిన్ వేసినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ప్రక్రియ కొంతకాలం పాటు కొనసాగుతుందని.. జనవరి 17 నుంచి జిల్లాలోని 222 కేంద్రాలలో టీకా వేయనున్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: 'అమ్మఒడి' డబ్బు బుడ్డీకి ఇవ్వలేదని.. భార్యను కొట్టిచంపిన భర్త..