విశాఖ ఆర్.కే.బీచ్లో ఆదివారం గల్లంతైన వారి మృతదేహాలు లభ్యమయ్యాయి. కె.శివకుమార్, మహమ్మద్ అజీజ్ మృతదేహాలు తీరానికి కొట్టుకొచ్చాయి. తెల్లవారుజాము నుంచి కె.శివకుమార్, మహమ్మద్ అజీజ్ ఆచూకీ కోసం మెరైన్, నేవీ బృందాలు బోటు, హెలికాప్టర్ ద్వారా గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో ఇవాళ మధ్యాహ్నం కె.శివకుమార్ మృతదేహం లభ్యం కాగా.. సాయంత్రానికి మహమ్మద్ అజీజ్ మృతదేహాన్ని సహాయక బృందాలు కనుగొన్నాయి.
ఘటన జరిగిన తీరు..
హైదరాబాద్ బేగంపేటకు సమీపంలోని రసూల్‌పురకు చెందిన ఎనిమిది మంది విద్యార్థుల బృందం విశాఖలో నూతన సంవత్సర వేడుకలు చూద్దామని డిసెంబరు 31న వచ్చారు. స్థానికంగా ఒక లాడ్జిలో దిగారు. రెండ్రోజులు నగరంలోనే ఉన్నారు. ఆదివారం ఉదయం 8 గంటలకు లాడ్జిని ఖాళీ చేశారు. సాయంత్రానికి హైదరాబాద్ తిరుగు ప్రయాణానికి ఏర్పాట్లు కూడా చేసుకున్నారు.
ఉదయం హార్బర్‌వైపు వెళ్లి, మధ్యాహ్నం సుమారు 2 గంటల సమయంలో ఆర్కేబీచ్ కాళీమాత ఆలయం ఎదురుగా ఉన్న తీరానికి చేరుకున్నారు. ఒక యువకుడిని లగేజీ వద్ద ఉంచి మిగతా ఏడుగురు సముద్ర స్నానానికి దిగారు.
కాసేపు అలల మధ్య సరదాగానే గడిపారు. ఈ ఏడుగురిలో సి.హెచ్ శివ(24), కె.శివకుమార్(21), మహమ్మద్ అజీజ్ (22) సముద్రంలో ఇంకాస్త ముందుకు వెళ్లారు. ఈలోపు పెద్ద అల ఈ ముగ్గుర్నీ మరింత లోనికి నెట్టేసింది. తీరంలో ఉన్న గజ ఈతగాళ్లు గుర్తించి వీరిని రక్షించే ప్రయత్నం చేసినప్పటికీ కుదరలేదు. సి.హెచ్.శివను ఒడ్డుకు తీసుకువచ్చినప్పటికీ.. కొన ఊపిరితో ఉన్న అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. కె.శివకుమార్ మహమ్మద్ అజీజ్ ఆచూకీ నిన్న లభించలేదు. ఇవాళ మృతదేహాలను కనుగొన్నారు. ఈ సంఘటనతో స్నేహితుల బృందం కన్నీటిపర్యంతమైంది.
ఇవీ చదవండి :