విషవాయువు దుర్ఘటనతో విశాఖ శివార్లలోని గ్రామాలకు గ్రామాలే ఖాళీ అయ్యాయి. ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా ఎల్‌జీ పాలిమర్స్ కంపెనీకి 2 కి.మీ. పరిధిలోని వారంతా తరలిపోవాలని విశాఖ జిల్లా యంత్రాంగం గురువారం రాత్రి ప్రకటించింది. దీంతో ప్రజలంతా భయాందోళనతో ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు. చాలా మంది సాధ్యమైనంత దూరం నడిచారు. ఆటోలు, ద్విచక్రవాహనాలు, కార్లలో సొంతూళ్లకు.. తెలిసిన వారి ఇళ్లకు బయలుదేరారు. తీవ్ర ప్రభావిత అయిదు గ్రామాలతో పాటు 20 ప్రాంతాలకు చెందిన 7లక్షల మంది తరలిపోయారని అంచనా.
గ్రామాలు నిర్మానుష్యం:
ఎల్‌జీ కంపెనీ పరిసర ప్రాంతాల వారు చాలా మంది రోడ్లకు పక్కనున్న చెట్ల ఆవాసంగా కాలం గడుపుతున్నారు. ఫుట్‌పాత్‌లపైకి కూడా చేరారు. కాలినడకన ఎక్కువ మంది విజయనగరం జిల్లా కొత్తవలస, ఎస్.కోట వైపు వెళ్లారు. వాహనాలపై వెళ్లిన వారికి కరోనా ఆంక్షలు అడ్డుగా నిలిచాయి. విజయనగరం జిల్లాలోకి వెళ్లేందుకు వాహనాలపై వచ్చిన వారిని మొదలవలస, కొత్తవలస వైపు చింతలపాలెం చెక్‌పోస్టుల వద్ద పోలీసులు అడ్డుకున్నారు. శ్రీకాకుళం వెళ్లేందుకు పైడిభీమవరం వద్దకు చేరుకున్న వారిని అక్కడి పోలీసులు అడ్డుకున్నారు. జిల్లాలోకి ప్రవేశిస్తే 14 రోజులు క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు. అంగీకరించిన వారినే ముందుకు పంపించారు. చాలామంది ప్రయాణికులు తనిఖీ కేంద్రం వద్ద ఉన్న గుడారాల్లోనే కూర్చున్నారు. చిన్నపిల్లలతో వచ్చిన వారు గంటల తరబడి నిరీక్షించినా అధికారులు అనుమతించకపోవటంతో వెనుదిరిగారు. ఇతర రాష్ట్రాలకు వెళ్లే వారిని మాత్రం తగు పత్రాలు చూసి అనుమతించారు. కొందరు సింహాచలం నుంచి పద్మనాభం వైపు వెళ్లారు.
ఇవీ చదవండి..ప్రమాదకర పరిశ్రమలపై జిల్లాల వారీగా జాబితా సిద్ధం