విశాఖ కేంద్రంగా కొత్త రైల్వే జోన్ ఏర్పాటులో జాప్యం కొనసాగుతూనే ఉంది. దాన్ని దక్షిణ కోస్తా జోన్‌గా పేర్కొంటూ కేంద్రం దాదాపు రెండేళ్ల కిందటే ప్రకటన చేసింది. ఈ మేరకు అధికారులు డీపీఆర్‌ను కూడా పంపారు. ఆ తర్వాత నుంచి రైల్వే బోర్డులో కదలిక లేకపోవడంతో కొత్త జోన్ అమలు ఎప్పటినుంచి అనేది ప్రశ్నార్థకమవుతోంది. కేంద్రం, రైల్వేశాఖపై ప్రజాప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేవడం లేదనే విమర్శలున్నాయి. సార్వత్రిక ఎన్నికలకు ముందు 2019 ఫిబ్రవరిలో రైల్వేశాఖ మంత్రి కొత్త జోన్ ఏర్పాటును ప్రకటించారు. దక్షిణ మధ్య రైల్వేలో ఎక్కువ భాగం, తూర్పుకోస్తా రైల్వే జోన్‌లో కొంత భాగం కలిపి మన రాష్ట్రంలోని దాదాపు రైల్వే పరిధి అంతా కొత్తగా ఏర్పడే దక్షిణ కోస్తా జోన్‌లో ఉండేలా అధికారులు నివేదిక రూపొందించారు. దాదాపు 3,496 కి.మీ. రైల్వే మార్గాలు, 5,437 కి.మీ. రైల్వే లైన్లను చేర్చారు. విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లు కొత్త జోన్ పరిధిలో ఉండేలా చూశారు. విశాఖ కేంద్రంగా ఉన్న వాల్తేరు డివిజన్ విజయవాడ డివిజన్‌లో కలిపారు. ఈ మేరకు డీపీఆర్‌ను 2019 ఆగస్టులోనే రైల్వే బోర్డుకు పంపారు.
అధికారికంగా అమలెప్పుడు?
డీపీఆర్‌ను రైల్వే బోర్డు పరిశీలించి రైల్వే శాఖకు పంపితే ఆమోదించాల్సి ఉంటుంది. కొత్త జోన్ ఏ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని రైల్వే శాఖ అధికారికంగా ప్రకటించాలి. దీనికి జనరల్ మేనేజర్‌ను నియమిస్తే ప్రక్రియ మొదలయ్యే వీలుంటుంది. జోన్ అమల్లోకి వచ్చాక ఉద్యోగుల విభజన, కార్యాలయాల ఏర్పాటుకు సమయం పడుతుంది. కొత్త జోన్ కోసం దాదాపు రూ.200 కోట్ల వరకు నిధులు అవసరమవుతాయని అంచనా. ప్రస్తుత ఆర్థిక సంవత్సర (2020-21) బడ్జెట్‌లో కొత్త జోన్‌తోపాటు.. వాల్తేరు డివిజన్ స్థానంలో రాయగడ కేంద్రంగా కొత్త డివిజన్ ఏర్పాటుకు కలిపి కేవలం రూ.3 కోట్లను తూర్పు కోస్తా జోన్ బడ్జెట్‌లో కేటాయించారు. కొత్త జోన్‌కు సంబంధించిన డీపీఆర్ ఏడాదిన్నర కిందట పంపినప్పటికీ తదుపరి చర్యలపై ఎలాంటి ఆదేశాలు రాలేదని రైల్వే అధికారులు చెబుతున్నారు. త్వరలోనే 2021-22 సంవత్సర కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నందున ఈసారైనా దక్షిణ కోస్తా జోన్ అమలు, పూర్తి స్థాయి నిధుల కేటాయింపుపై ప్రకటన కోసం ఆశగా నిరీక్షిస్తున్నారు.
* ఎంతో చారిత్రక నేపథ్యం, అధిక ఆదాయం తెచ్చిపెట్టే వాల్తేరు డివిజన్‌ను కొనసాగించాలని అన్ని పార్టీల నేతలు, సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. రాయగడలో కొత్త డివిజన్ ఏర్పాటు చేస్తున్నప్పటికీ.. వాల్తేరు డివిజన్‌ను కొనసాగించాలని కోరుతున్నారు. దీనిపైనా రైల్వే ఉన్నతాధికారులనుంచి స్పష్టత రాలేదు.