విశాఖ ఆశీల్ మెట్ట సమీపంలోని సంపత్ వినాయగర్ ఆలయం... ఎంతో ప్రతిష్ట కలిగిన మందిరంగా పేరొందింది. సంబంధన్ సంస్థ భవనానికి వాస్తుపరమైన అంశాల కోసం... 1950 వ సంవత్సరంలో తమ కార్యాలయం ఎదుట వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్టించింది. అప్పట్లో తమిళనాడు నుంచి అర్చకస్వామిని తీసుకువచ్చిన సంస్థ నిర్వాహకులు..... నిత్యం పూజలు చేయించేవారు. అలా ప్రతిష్టించిన సంపత్ వినాయకుడు.... కాలక్రమంలో భక్తుల మనోభీష్టాలు నెరవేర్చే ఇలవేల్పయ్యాడు. సంపత్ వినాయకుడికి రోజూ తెల్లవారుజామున గణపతి హోమం, హవనం, మూలవిరాట్టుకు అభిషేకం చేయడం ఆనవాయితీగా వస్తోంది.
ఒక్కో రోజు ఒక్కో అలంకరణ
ఈ ఆలయ సేవలు, అర్చనల్లో... పేద, గొప్ప భేదాలు కనిపించవు. ఈ విశిష్ఠతే భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. అర్చనలు, ఇతర సేవల్లో పాల్గొనేందుకు నెలలు తరబడి తమవంతు కోసం భక్తులు వేచి చూస్తుంటారు. తమిళ, తెలుగు సంప్రదాయాలు ఇక్కడ ప్రస్ఫుటిస్తుంటాయి. గణపతి నవరాత్రులలో స్వామివారికి ఒక్కో రోజు ఒక్కో అలంకరణలో అర్చనలు చేయడం... సంపత్ వినాయగర్ ఆలయ ప్రత్యేకత.
నాడు అడ్మిరల్ జనరల్ రాక
1971లో భారత్-పాకిస్థాన్ యుద్ధ సమయంలో అప్పటి అడ్మిరల్ జనరల్.... స్వామివారి ఆశీస్సులు తీసుకుని వెళ్లారు. యుద్ధంలో విజయం సాధించిన అనంతరం ఇక్కడికి వచ్చి మొక్కు తీర్చుకున్నారు. అప్పటి నుంచి దేశానికి విజయం అందించిన దేవుడిగా "సంపత్ వినాయకుడు" ప్రశస్తి పొందాడు.
దేవదాయశాఖ అధీనంలోనే ఉన్నా... ఆలయ పూజలు, ఉత్సవాల నిర్వహణ, ఇతర సేవలన్నీ ఆలయ వ్యవస్థాపక సంస్థ సంబంధన్ అండ్ కంపెనీ కుటుంబ సభ్యుల నిర్వహణలోనే జరుగుతాయి.