విశాఖపట్నం శ్రీహరిపురంలో నివాసముంటున్న కాళిబట్ల లక్ష్మి(76) భర్త పదేళ్ల క్రితం చనిపోయాడు. ఆమెకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. కుమార్తెకు పెళ్లయి అత్తవారింట్లో ఉంటోంది. కుమారుడు చక్రవర్తి ప్రవర్తన సరిగ్గా లేకపోవటంతో అతడిని భార్య వదిలేసింది. దీంతో తల్లీకొడుకులు కలిసి ఉంటున్నారు. ఈ క్రమంలో మద్యానికి బానిసైన చక్రవర్తి డబ్బు కోసం తల్లిని వేధించసాగాడు. అతని వేధింపులు తట్టుకోలేక ఆమె కంచరపాలెంలోని వృద్ధాశ్రమంలో చేరింది. మూడేళ్లుగా అక్కడే ఉంటూ తనకు వచ్చే వృద్ధాప్య పింఛను డబ్బులను దాచిపెట్టుకుంది.
ఇదిలా ఉండగా.. తల్లి దగ్గర డబ్బులు ఉన్నట్లు చక్రవర్తి పసిగట్టాడు. ఎలాగైనా వాటిని తీసుకోవాలని అనుకున్నాడు. ఈనెల 1వ తేదీన వృద్ధాశ్రమానికి వెళ్లాడు. బిడ్డ తనను చూడ్డానికి వచ్చాడని ఆ తల్లి సంబరపడింది. మద్యం మానేశానని, విజయవాడలో పని దొరికిందని, అక్కడికి వెళ్లి బతుకుదామని చెప్పి తల్లిని వృద్ధాశ్రమం నుంచి తీసుకువచ్చాడు. విశాఖ రైల్వే స్టేషన్ సమీంపలోని ఓ లాడ్జిలో ఉంచాడు. ఈనెల 6వ తేదీన తనకు డబ్బులు కావాలని తల్లిని అడిగాడు. ఆమె ఇవ్వకపోవటంతో మద్యం మత్తులో ఉన్న చక్రవర్తి ఆమెను గొంతు నులిమి చంపేశాడు. అనంతరం డబ్బులు తీసుకుని గదికి తాళం వేసి బయటకు వెళ్లిపోయాడు.
అర్ధరాత్రి పూటుగా మద్యం తాగి మళ్లీ గదికి వచ్చి పడిపోయాడు. తెల్లవారాక లాడ్జి సిబ్బంది అతడిని లేపి అడగ్గా.. మా అమ్మ లోపల గడియ పెట్టుకుని తెరవడం లేదని చెప్పాడు. దీంతో లాడ్జి సిబ్బంది పోలీసులకు సమాచారమిచ్చారు. తనకేమీ తెలియదని.. తాను బయటకు వెళ్లి వచ్చేసరికి తల్లి చనిపోయి ఉందని చక్రవర్తి పోలీసులకు చెప్పాడు. అయితే పోలీసులకు అనుమానం వచ్చి తమదైన శైలిలో విచారించగా నిజం ఒప్పుకున్నాడు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి..