ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలం వరాహ లక్ష్మీనరసింహ దేవస్థానం హుండీల్లో భక్తులు వేసి, లెక్కించిన ఇత్తడి కానుకలు మాయమైనట్లు విశ్వసనీయ సమాచారం. దీనికి సంబంధించి దేవస్థానం అధికారులు గోపాలపట్నం పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదుచేయగా శనివారం ఆలయంలోని సీసీ కెమెరాలను తనిఖీ చేసినట్లు తెలిసింది. కొండపై ప్రధాన ఆలయ ప్రాంగణ కల్యాణ మండపంలో భద్రపరిచిన వస్తువులు కనిపించకుండా పోవడంపై విస్మయం వ్యక్తమవుతోంది. చుట్టూ సీసీ కెమెరాల నిఘా, భద్రతాసిబ్బంది ఉన్నా ఈ సామగ్రిని ఎవరు, ఎక్కడికి తరలించారో అంతుపట్టడం లేదు. సాధారణంగా భక్తులు మొక్కు చెల్లించుకునేందుకు ఇత్తడి కడియాలను చేతికి ధరిస్తారు.
స్వామిని దర్శించుకునేటప్పుడు వాటిని ఆలయ హుండీల్లో వేస్తారు. అలాగే ఇత్తడితో చేసిన కోడె దూడలు, గంటల బొమ్మలను హుండీల్లో వేస్తారు. వీటన్నింటినీ ఏటా దేవస్థానం వేలంలో విక్రయిస్తుంది. దీంతో ఆలయానికి ఆదాయం సమకూరుతుంది. ఇలాగే కొన్నిరోజుల క్రితమే వేలం వేసినట్లు తెలిసింది. వేలం దక్కించుకున్న వ్యాపారి కొంత తరుగు ఇవ్వాలని అధికారులను కోరడంతో కొద్ది రోజులుగా వాటిని మూటలు కట్టి స్థానిక కల్యాణ మండపంలో ఉంచారు. సుమారు 50 బస్తాలను భద్రపరచగా ఇప్పుడు వాటిలో 30కి పైగా బస్తాలు మాయమైనట్లు విశ్వసనీయ సమాచారం. ఇవి నిజంగా చోరీకి గురయ్యాయా, లేకపోతే వ్యాపారి తీసుకువెళ్లారా అనేది ఇంకా తేలాల్సి ఉంది.
ఇదీ చదవండి: లష్కరే తోయిబా కమాండర్ జహిద్ టైగర్ హతం