రాజధాని తరలింపు అంశం మరోసారి చర్చనీయాంశమైంది. విశాఖలో శనివారం దీనిపై విస్తృత ప్రచారం సాగింది. ఉన్నత విద్యామండలి కార్యాలయాన్ని ఆంధ్రవిశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారనే సమాచారంపై చర్చలు సాగాయి. ఏయూలోని ‘విద్యాభవనం’లో ఈ కార్యాలయాన్ని ఏర్పాటుచేయొచ్చని వినిపిస్తోంది. విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా చేసి కార్యాలయాలను తరలిస్తామని రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు పలుసార్లు ప్రకటించారు. అందుకోసం పలు భవనాలను పరిశీలించారు. ప్రైవేటు భవనాలను లీజుకు తీసుకుంటామని అనధికారికంగా చెప్పినట్లు సమాచారం. తొట్లకొండపై గ్రేహౌండ్స్ కార్యాలయం, కొన్ని ప్రైవేటు ప్రాంగణాలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి.
వీటిపైనా: దాదాపు 200 ఎకరాల్లో కాపులుప్పాడలోని కొండపై ఐటీ లేఅవుట్‌ను అభివృద్ధి చేసినా.. రెండున్నరేళ్లుగా ఆ సంస్థలకు కేటాయించకుండా స్థలాలను ఖాళీగానే ఉంచారు. పిఠాపురం కాలనీలో వీఎంఆర్‌డీఏ నిర్మించిన ఐదు అంతస్తుల భవనం కూడా కొన్ని నెలలుగా ఖాళీగా ఉంది. గంభీరం వద్ద మూసేసిన ఓ ప్రైవేటు కళాశాలలో, మధురవాడ ఐటీ హిల్స్‌లో పలు భవనాలు ఖాళీగా ఉన్నాయి. దాదాపు 10 అంతస్తుల్లోని మిలీనియం టవర్స్‌లో టవర్-బి నిర్మాణం చాలావరకు పూర్తయింది. వీటిలో కార్యాలయాలకు ఏవి ఉపయోగపడతాయో పరిశీలిస్తున్నట్లు చర్చ సాగుతోంది.
ఇదీ చదవండి: పంచాయతీల్లో తాగునీటి పథకాల నిర్వహణ అస్తవ్యస్తం