విశాఖలో కరోనా వ్యాప్తి నివారణపై మంత్రులు సమీక్షించారు. జిల్లాలో కేసుల నమోదు తీరు, నిర్థారణ పరీక్షలపై అధికారులతో చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి కన్నబాబు వివరాలు వెల్లడించారు. విశాఖలో పాజిటివ్ కేసు నమోదు కాకముందు నుంచే వైరస్ కట్టడికి చర్యలు తీసుకున్నామని తెలిపారు. జిల్లా కలెక్టర్ నేతృత్వంలో 21 కమిటీలు పని చేస్తున్నాయని చెప్పారు. 2.06లక్షల మంది కంటైన్మెంట్ జోన్లలో ఉన్నారని తెలిపిన మంత్రి...విమ్స్ లో 148 క్రిటికల్ కేర్, 140 నాన్ క్రిటికల్ కేర్ పడకలు ఉన్నాయని చెప్పారు. విశాఖలో 151 మందిని క్వారంటైన్లో ఉంచామని వెల్లడించారు.
'విశాఖ మెడ్‌టెక్ జోన్లో వెంటిలేటర్లు, ల్యాబ్ కిట్లు తయారవుతున్నాయి. పాయకరావుపేటలో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. ఆ ప్రాంతాన్ని కూడా రెడ్ జోన్‌గా ప్రకటించాం.నిత్యావసర సరకులు పూర్తిగా అందుబాటులో ఉన్నాయి. రేషన్ కార్డు ఉండి బియ్యం తీసుకునే అందరికీ డబ్బు వస్తోంది' - కన్నబాబు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి
రైతులు తీవ్రంగా నష్టపోయారు..
రాష్ట్రంలో అకాల వర్షాలు వల్ల వరి, మొక్కజొన్న రైతులు తీవ్రంగా నష్టపోయారని మంత్రి కన్నబాబు అన్నారు. ఆహార పంటల కంటే ఉద్యానవన పంటల్లోనే ఎక్కువ నష్టం వచ్చిందని చెప్పారు. ప్రతిరోజు అరటి పంటను రెండు వేల టన్నులు కొంటున్నామని వెల్లడించారు. ఆహార ధాన్యాల పంటలు 13.24 వేల హెక్టార్ల మేర నష్టం జరిగితే ... 15.33 హెక్టార్లలో ఉద్యానవన పంటల నష్టం జరిగినట్టు అంచనా వివరాలు వెల్లడించారు.
విశాఖ జిల్లాలోని పరిస్థితులపై సమీక్షించామని ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా కోటి 47 లక్షల కార్డులకు రేషన్ ఇవ్వాలని ఆదేశించామని ... ఇప్పటికే 92 శాతం మందికి సరఫరా చేశామని చెప్పారు. రేషన్ కార్డులు లేని వారికి, గుడిసెల్లో ఉన్నవారికి కూడా వసతి కల్పిస్తున్నామని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: