నూతన ఆవిష్కరణలను సరైన రీతిలో ముందుకు తీసుకువెళ్తే వచ్చే లాభాలు ఊహించని విధంగా ఉంటాయి. అందుకే వినూత్న ఉత్పత్తులు ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లలో వెల్లువెత్తుతున్నాయి. ఫలితంగా ఎంతోమందికి ఉపాధి కలుగుతోంది. ఆర్థిక వ్యవస్థ కూడా బలోపేతం అవుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం నూతన ఆవిష్కరణలకు కృషి చేసేవారికి అనేక రూపాలుగా సహాయసహకారాలు అందిస్తోంది. అందులో భాగంగా విశాఖలోని ఐ.టి.హిల్-3లో ఉన్న ఇన్నోవేషన్ వ్యాలీ భవనంలో ఎన్.ఆర్.డి.సి. కార్యాలయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇక్కడి అధికారులు సరికొత్త ఆలోచనలు వెలుగులోకి వచ్చేలా చైతన్యపరుస్తున్నారు.
పెరుగుతున్న దరఖాస్తులు
విశాఖలో ఏర్పాటు చేసిన జాతీయ పరిశోధన అభివృద్ధి కార్పొరేషన్(ఎన్ఆర్డీసీ) అధికారుల్ని సంప్రదించి మేధో సంపత్తి(పేటెంట్) హక్కుల కోసం దరఖాస్తు చేసే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. వినూత్న ఆవిష్కరణలు చేసి పేటెంట్లు పొందితే ఒనగూరే ప్రయోజనాలపై ఎన్.ఆర్.డి.సి. అధికారులు పలు విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థలు, పారిశ్రామిక ప్రతినిధులకు అవగాహన కల్పిస్తున్నారు.
సాధారణమైనదే అనుకోవద్దు
కొన్ని విద్యా సంస్థల్లో విద్యార్థులు, పారిశ్రామిక సంస్థల్లోని నిపుణులు వివిధ రంగాలకు అవసరమైన ఆవిష్కరణలను చేస్తుంటారు. కానీ చాలామంది వాటికి మేధోసంపత్తి హక్కులు పొందకుండా వదిలేస్తుంటారు. ఫలితంగా అవే ఆవిష్కరణల ఆధారంగా కొందరు ఉత్పత్తులను తయారుచేసి మార్కెట్లో విజయాలు సాధించి ఆర్థికంగా భారీఎత్తున లబ్ధి పొందుతున్నారు. అందుకే ఆ అవకాశం అసలైన ప్రతిభావంతులకే దక్కాలనే లక్ష్యంతో ఎన్ఆర్డీసీ కృషి చేస్తోంది.
ఆవిష్కరణలకు రక్షణ
ఆవిష్కరణలు ఆస్తులతో సమానం. మీ సృజనను తక్కువగా అంచనా వేస్తే భారీగా నష్టపోయే ప్రమాదముంది. ఈ ఇబ్బందులు ఎదురవకుండా ఎన్ఆర్డీసీ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. చట్ట నిబంధనలను ఉల్లంఘించి ఇతరుల ఆవిష్కరణలను కాపీ కొట్టేవారిపై కఠిన చర్యలు తీసుకునేలా ఏర్పాట్లు చేసింది.
ఆవిష్కరణల రంగంపై దృష్టి పెట్టాలి
ఆవిష్కరణల రంగంలో అపార అవకాశాలున్నాయి. పలువురు వినూత్న ఆలోచనలతో అంకుర సంస్థలు ఏర్పాటు చేసుకుని అనూహ్య విజయాలు సొంతం చేసుకుంటున్నారు. ప్రతిభావంతులకు ఎన్.ఆర్.డి.సి. అన్ని రకాలుగా అండగా నిలుస్తుంది. వారికి అవసరమైన నైపుణ్యాలపై శిక్షణ ఇప్పిస్తున్నాం. విద్యార్థులు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేకుండానే పేటెంట్ హక్కుల కోసం దరఖాస్తు చేయిస్తున్నాం. నూతన ఆవిష్కరణలు మార్కెట్లోకి వెళ్లేలా పారిశ్రామికవేత్తలను ఆవిష్కర్తలకు అనుసంధానం చేస్తున్నాం. www.nrdcindia.com అంతర్జాల చిరునామాలో మా సంస్థ అందిస్తున్న సమగ్ర సేవలు, సదుపాయాల్ని పొందుపరిచాం- డాక్టర్ బి.కె.సాహు, ప్రాంతీయ మేనేజర్, ఎన్.ఆర్.డి.సి, విశాఖపట్నం