విశాఖ సముద్ర తీర ప్రాంతంలో విషతుల్య రసాయనాలు, వ్యర్థాల చేరికను నిలువరించేలా ఆదేశాలు జారీచేయాలని కోరుతూ హైకోర్టులో పిల్ దాఖలైంది. విశాఖ, కాకినాడ తీరప్రాంతలపై అధ్యయనం చేసి తగిన సూచనలు చేసేందుకు నిపుణులతో కమిటీ వేయాలని పిటిషనర్లు కోరారు. ప్రముఖ పర్యావరణవేత్త డాక్టర్ రాజేంద్రసింగ్, విశాఖపట్నానికి చెందిన సామాజిక ఉద్యమకారుడు, పర్యావరణవేత్త బి. సత్యనారాయణ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.
పరవాడ ఔషధ కంపెనీల నుంచి విషతుల్య రసాయనాల్ని సముద్ర తీరం, సమీపంలోని చెరువుల్లోకి విచక్షణారహితంగా విడుదల చేస్తున్నారన్నారు. మరోవైపు తీరంలోకి ప్లాస్టిక్ వ్యర్థాలు వచ్చి చేరుతున్నాయన్నారు. దీంతో తీర ప్రాంతం కలుషితమైందన్నారు. అక్కడి వృక్షాలు, జంతుజాలానికి , మత్స్యకారుల ఆరోగ్యానికి ప్రమాదం పొంచి ఉందన్నారు. విశాఖ బీచ్ , ముడసర్లోవ రిజర్వాయర్ , భీమిలిలోని చిల్లపేట చెరువులను కాలుష్యం నుంచి రక్షించడంలో గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పోరేషన్ విఫలమైందన్నారు. రాష్ట్ర పర్యావరణ, అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి , రాష్ట్ర పర్యావరణ నియంత్రణ మండలి చైర్మన్ , ఏపీ జీవవైవిద్య మండలి చైర్మన్ , కేంద్ర పర్యావరణశాఖ కార్యదర్శి , విశాఖ కలెక్టర్ , జీవీఎంసీ కమిషనర్లను వ్యాజ్యంలో ప్రతివాదులుగా పేర్కొన్నారు.
ఇదీ చదవండి: కశ్మీర్లో ఉగ్రకుట్ర భగ్నం.. పేలుడు పదార్థాలు స్వాధీనం