అతిశీతల ప్రదేశంగా గుర్తింపు పొందిన లంబసింగికి కొన్నేళ్లగా పర్యటకులు వేలాదిగా పోటెత్తుతున్నారు. శీతాకాలమంతా లంబసింగి సహా చుట్టుపక్కల ప్రాంతాలన్నీ వేలమంది సందర్శకులతో నిండిపోతున్నాయి. ఈ ప్రాంతంలో పర్యటకశాఖ ఇప్పటికే విడిది గృహాలను నిర్వహిస్తోంది. కొన్ని ప్రాజెక్ట్‌ల పనులు పురోగతిలో ఉన్నాయి. ప్రైవేట్ వ్యక్తులు, పర్యటకుల అవసరాలు దృష్టిలో పెట్టుకుని అవసరమైన వసతులు సమకూర్చుతున్నారు. వీటితో పాటు ఈ ప్రాంతంలో ఎకో టూరిజం ద్వారా మరింత అభివృద్ధి సాధించేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి.
ప్రధానంగా అటవీ అభివృద్ధి సంస్థలకు ఆర్‌వీనగర్, చింతపల్లి, పాడేరు, తదితర ప్రాంతాల్లో నాలుగు వేల హెక్టార్లలో కాఫీ తోటలు ఉన్నాయి. కాఫీ గింజలు ఎండబెట్టేందుకు పలు యార్డులు ఉన్నాయి. చాలా చోట్ల విశాలమైన స్థలాలు ఉన్నాయి. ఈ స్థలాల్లో కాటేజీలు నిర్మించాలని యోచిస్తున్నారు. తద్వారా పర్యటకులకు వసతి సమస్య తీరడంతోపాటు సంస్థకు ఆదాయం వస్తుంది. పర్వత శ్రేణిలో కాఫీ తోటలన్నీ దట్టమైన పచ్చదనంతో నిండి ఉంటాయి. వీటిలో ట్రెక్కింగ్ వంటి అవకాశాలు కల్పించాలని యోచిస్తున్నారు.
వివిధ రాష్ట్రాలు తేయాకు తోటలకు ప్రసిద్ధిగా ఉన్నాయి. మన్యంలో అటవీ అభివృద్ధి సంస్థతోపాటు పలువురు గిరిజన రైతులకు కాఫీ తోటలు ఉన్నాయి. ఈ తోటల వద్ద పర్యటకులకు స్వాగతం పలికేలా ఏం చేస్తే బావుంటుందనే దానిపై దృష్టిసారించారు. నర్సీపట్నం నుంచి చింతపల్లి, గూడెంకొత్తవీధి తదితర మండలాల్లో రోడ్లకు ఇరువైపులా అవెన్యూ ప్లాంటేషన్లు వేసేందుకు అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే చాలాచోట్ల రోడ్లకు ఇరువైపులా పచ్చదనం పెంచారు. ఎవెన్యూ ప్లాంటేషన్ల ద్వారా రంగు రంగుల పూలు, నీడనిచ్చేలా మొక్కలు పెంచాలన్నది యోచన. తద్వారా పర్యటకుల్లో కొత్త అనుభూతి కలిగించాలని భావిస్తున్నారు.
జీవనోపాధి అవకాశాల పెరుగుదల
పర్యటక అభివృద్ధి ద్వారా ఆ ప్రాంతం పౌరులకు జీవనోపాధి అవకాశాలు పెరుగుతాయి. విశాఖ మన్యంలో జంతువులు, విలువైన ఔషధ మొక్కలు ఉన్నాయి. వాటికి ప్రాచుర్యం లభిస్తుంది. లంబసింగి అడవుల్లో బ్రిటీష్ పాలకుల హయాంలో విడిది కేంద్రం ఉండేది. అదిప్పుడు శిథిలమైంది. దానిస్థానంలో కొత్త విడిది కేంద్రం నిర్మిస్తే బావుంటుంది. దీన్ని చూసొచ్చాం. పర్యటకులకు ఏ వసతులు అవసరమో అవన్నీ సమకూర్చేలా ప్రణాళికలు రూపొందించాలన్నది యోచన. అరకు, అనంతగిరి, మినుములూరు తదితర ప్రాంతాల్లోనూ ఎకో టూరిజాన్ని మరింత అభివృద్ధి చేస్తాం.
- విజయ్‌కుమార్, ఎకోటూరిజం ప్రాజెక్ట్ రాష్ట్ర సంచాలకులు