CPM Srinivasarao on Ambati: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోలవరం ప్రాజెక్టును ప్రశ్నార్థకం చేస్తే సహించబోమన్నారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు. అదే సమయంలో.. నిర్వాసితులను నీట ముంచేస్తే ఊరుకునేది లేదన్నారు. డిజైన్ లో లోపం ఉందని, డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందంటూ..రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు మాటలు చూస్తుంటే అనేక అనుమానాలు కలుగుతున్నాయని అన్నారు. అసలు పోలవరం ప్రాజెక్టు పూర్తి అవుతుందా? అనే సందేహాలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆగష్టులో వర్షాలు వస్తే ప్రాజెక్టుకు ఆనుకుని ఉన్న గ్రామాలు మునిగిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మంత్రి అంబటి వ్యాఖ్యల మీద కేంద్ర నీటి పారుదల శాఖ మంత్రి, జల శక్తి సంఘం స్పందించాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోలవరాన్ని పూర్తి చేస్తాయో లేదోనని ఆందోళనగా ఉందన్నారు. పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన చేసి ప్రజలకు అందించాలని కోరారు. జాప్యం చేస్తూ ఇలా ఆదివాసీల జీవితాలతో ఆడుకోవడం సరికాదని ఆయన సూచించారు. విశాఖలో సీపీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇదీ చదవండి : "బాబు బ్యానర్లో.. పవన్ హీరోగా దత్తపుత్రుడు సినిమా.. ఫ్లాప్ ఖాయం"