జిల్లాల పునర్విభజన ప్రక్రియలో భాగంగా శాఖల వారీ ఉన్న భూములు, భవనాల వివరాలను ఈనెల 6వ తేదీలోపు సమర్పించాలని విశాఖ జిల్లా కలెక్టర్ వినయ్‌చంద్ జిల్లా అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశమందిరంలో ఆయన అధికారులతో సమీక్షించారు. భూములు, భవనాల గుర్తింపు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ప్రతిశాఖకు సంబంధించిన ఆస్తులు, ఇతర వివరాలు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పోర్టల్‌లో నమోదు చేయాలన్నారు.
విశాఖపట్నం, అనకాపల్లి, నర్సీపట్నం, పాడేరు డివిజన్లతోపాటు పార్లమెంటు నియోజకవర్గ కేంద్రమైన అరకు వివరాలను సేకరించాలన్నారు. శాఖల వారీ స్థలాల విస్తీర్ణం తెలియజేయాలన్నారు. ఆయా శాఖల అధికారులు పంపే వివరాలను ఆర్డీఓలు ధ్రువీకరించాలన్నారు. ప్రతి అధికారి చిన్న సమస్యను సైతం క్షుణ్ణంగా పరిశీలన చేయాలని, వివాదాలు ఏమైనా ఉంటే తన దృష్టికి తీసుకురావాలని చెప్పారు. కొత్త జిల్లాలకు సంబంధించి కలెక్టర్, ఎస్పీ, జిల్లా న్యాయస్థానాల భవనాలకు అవసరమైన భూములను గుర్తించాలన్నారు. సమావేశంలో ఎస్పీ కృష్ణారావు, జేసీలు వేణుగోపాల్‌రెడ్డి, అరుణ్‌బాబు, నర్సీపట్నం సబ్ కలెక్టర్ మౌర్య, ఐటీడీఏ పీఓ వెంకటేశ్వర్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: