విశాఖ వేదికగా అంతర్జాతీయ బిమ్స్‌టెక్ సదస్సు జరుగుతోంది. ఇవాళ్టి నుంచి రెండ్రోజుల పాటు జరగనుంది. బిమ్స్‌టెక్ సదస్సును కేంద్రమంత్రి మన్‌సుఖ్ ఎల్ మాండవ్య ప్రారంభించారు. ఈ సదస్సుకు మొదటిసారిగా విశాఖ పోర్టు ట్రస్టు ఆతిథ్యమిస్తోంది. ప్రభుత్వ, ప్రైవేటు పోర్టుల ఛైర్మన్లు, సీఈవోలతోపాటు.. 7 దేశాల నుంచి ప్రతినిధులు సదస్సులో పాల్గొన్నారు. పెట్టుబడి అవకాశాలు, స్వేచ్ఛా వాణిజ్య అభివృద్ధిపై సదస్సులో చర్చించున్నారు. పర్యటక అభివృద్ధి, రక్షణకు సంబంధించిన అంశాలపైనా చర్చ జరగనుంది.
విశాఖకు అరుదైన అవకాశం
బిమ్స్‌టెక్ సదస్సు నిర్వహణ విశాఖ పోర్టుకు దక్కిన అరుదైన అవకాశమని.. పోర్టు ఛైర్మన్ రామ్మోహన్‌రావు అన్నారు. విశాఖలో ఎంతో ఆసక్తికరమైన చారిత్రక ప్రదేశాలు ఉన్నాయని రాష్ట్ర మంత్రి అవంతి శ్రీనివాసరావు తెలిపారు. పోర్టుల రంగంలో పెద్దఎత్తున ఉద్యోగాలకు అవకాశాలున్నాయని.. ముంబయి పోర్టు ఛైర్మన్ సంజయ్ భాటియా అభిప్రాయపడ్డారు. బిమ్స్‌టెక్ దేశాల మధ్య సహకారంతో ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందే అవకాశముందన్నారు. భారతీయ పోర్టులలో వృద్ధి రేటు బాగుందన్నారు. బిమ్స్‌టెక్ పోర్టు సెంటర్ ఏర్పాటు దిశగా ఆలోచన సాగాలన్నారు.
బిమ్స్‌టెక్ దేశాల మధ్య బహుముఖ పోర్టుల అనుసంధానం ఉండాలని కేంద్రమంత్రి మన్‌సుఖ్ మాండవ్య అన్నారు. బంగాళాఖాతం వెంబడి భారత్‌కు 6 మేజర్ పోర్టులు, 73 మైనర్ పోర్టులున్నాయన్న ఆయన... బిమ్స్‌టెక్ దేశాల పోర్టులు వాణిజ్య సంబంధాలు, రవాణా వసతులు పెంచుకోవాలని సూచించారు. దేశంలో వేల కోట్ల వ్యయంతో పోర్టులను అభివృద్ధి చేస్తున్నామని కేంద్ర మంత్రి తెలిపారు. 3.71 బిలియన్ వాణిజ్య కార్యక్రమాలు పోర్టుల ద్వారా జరుగుతున్నాయని మంత్రి అన్నారు.
బిమ్స్‌టెక్..
వివిధ రంగాల్లో పరస్పర సహకారంతో... ఆర్థిక అభివృద్ధే లక్ష్యంగా బంగాళాఖాతం సరిహద్దుగా కలిగిన ఏడు దేశాలు సమితిగా ఏర్పడి... అంతర్జాతీయ సంస్థ బిమ్స్టెక్ను రూపొందించాయి. బిమ్స్టెక్లో బంగ్లాదేశ్, భారత్, మయన్మార్, శ్రీలంక, థాయ్లాండ్, నేపాల్, భూటాన్ సభ్యదేశాలుగా ఉన్నాయి. బిమ్స్‌టెక్ దేశాలు 14 రంగాల్లో పరస్పర సహకారం అందించుకోవాలని నిర్దేశించుకున్నాయి. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై ఈ దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఈ సంస్థ ప్రధానకార్యాలయం బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఉంది.
ఇదీ చదవండి: